Heart Emoji: ఇది స్మార్ట్‌ఫోన్ల కాలం.. ప్రతీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే.. అందులో సోషల్ మీడియా యాప్‌లకు కొదవే లేదు.. ఇక, స్మార్ట్‌ఫోన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వాట్సాప్ అనేలా తయారైంది పరిస్థితి.. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునే వీలు ఉండడంతో పాటు.. వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయాలు.. రోజుకో కొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడూ తన యూజర్లను కట్టిపడేస్తోంది వాట్సాప్.. అయితే, వాట్సాప్‌లో గుట్టుగా చాటింగ్ చేసుకుంటూ.. ఇష్టం వచ్చిన ఎమోజీలు పెడుతున్నారు.. అయితే, మీరు వాట్సాప్‌లో లేదా ఏదైనా సైట్‌లో హార్ట్ ఎమోజీని కూడా ఉపయోగిస్తుంటే, మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే.
ఎందుకంటే, కువైట్‌లో వాట్సాప్ లేదా ఏదైనా ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా ఒక అమ్మాయికి హార్ట్ ఎమోజీని పంపడం ఇప్పుడు అసభ్యతను ప్రేరేపించే నేరంగా పరిగణించబడుతుంది.. ఇది చట్టం ప్రకారం నేరం, శిక్ష తప్పదు. కువైట్ న్యాయవాది హయా అల్ షాలాహి ప్రకారం, ఈ నేరానికి పాల్పడిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు 2,000 కువైట్ దినార్లకు మించకుండా జరిమానా విధించవచ్చు. అదేవిధంగా వాట్సాప్‌లో ‘రెడ్ హార్ట్’ ఎమోజీని పంపడం వల్ల పొరుగున ఉన్న సౌదీ అరేబియాలో జైలు శిక్ష పడుతుంది.
ఇప్పటికే సౌదీలో అమల్లో ఉన్న చట్టం ప్రకారం, ఎవరైనా ఈ చర్యకు పాల్పడినట్లు తేలితే వారికి రెండు నుండి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 100,000 సౌదీ రియాల్స్ జరిమానా విధించబడుతుంది. సౌదీ సైబర్ క్రైమ్ నిపుణుడి ప్రకారం, వాట్సాప్‌లో రెడ్ హార్ట్‌లను పంపడం వేధింపుగా పరిగణించబడుతుంది. సౌదీ అరేబియాలోని యాంటీ-ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోటాజ్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ సంభాషణల సమయంలో కొన్ని చిత్రాలను పంపి తమ భావ వ్యక్తీకరణను తెలియజేయడంపై దావా వేస్తే వేధింపుల నేరంగా మారవచ్చు అని వార్నింగ్ ఇచ్చారు. ఇక, పదే పదే ఉల్లంఘించిన సందర్భాల్లో, జరిమానా 300,000 సౌదీ రియాల్‌లకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. ప్రస్తుతానికి మన దేశంలో దీనిపై ఎలాంటి ఆంక్షలు లేకపోయినా.. భవిష్యత్‌లో ఆంక్షలు పెడతారేమో? శిక్షలు తప్పవేమో..? జరిమానాలు విధిస్తారేమో..? అతిగా చాటింగ్ చేస్తూ.. ఇష్టం వచ్చిన ఎమోజీలు పెట్టే నెట్ బాబులు జాగ్రత్త మరి.