Site icon NTV Telugu

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాల తనిఖీలు.. ఎమ్మెల్యే పర్యటనలు రద్దు!

Polavaram

Polavaram

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అడవులలో మావోల ఏరివేత వేగవంతంగా జరుగుతుంది. అటు పోలీసులు, ఇటు మావోలు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే జరిగిన ఎన్కౌంటర్‌లో మావో సుప్రీం కమాండర్ నంబాలకేశ్వరరావు మృతి చెందటంతో మావోలు ప్రతీకార చర్య చేపడతారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్ పరిసర జిల్లాల్లో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఏలూరు జిల్లాలోని పోలవరం అటవీ ప్రాంతంతో పాటు పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో భద్రతా దళాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. పోలవరం ఏజెన్సీ ప్రాంతానికి చేరుకున్న భద్రత దళాల్లోని బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పోలవరంలో తనిఖీలు నిర్వహించారు. శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న పోలవరం ప్రాజెక్టు భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంత చుట్టుపక్కల డ్రోన్ కెమెరాతో జల్లెడ పడుతున్నారు.

Also Read: Cyber Crime: అచ్యుతాపురంలో సైబర్ డెన్ గుట్టురట్టు.. కాల్ సెంటర్ ముసుగులో..!

గతంలో పోలవరం ఏజెన్సీ ప్రాంతం నక్సల్స్‌కు షెల్టర్ జోన్‌గా ఉండేది. భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతానికి నక్సలైట్లు కదలికలు గమనించేందుకు డ్రోన్ కెమెరా ద్వారా తనిఖీలు కొనసాగిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఏవైనా విధ్వంసం చేస్తారని ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు 10 రోజులు ఎలాంటి పర్యటనలు పెట్టుకోవద్దని పోలీస్ శాఖ సూచనలు చేసింది. ఎమ్మెల్యేను నేరుగా కలిసేందుకు కూడా రావద్దని, ఫోన్‌లో సంప్రదించాలని ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఏజెన్సీ ప్రాంతం బుట్టాయగూడెం మండలం బర్రింకలపాడు గ్రామం ఎమ్మెల్యే నివాసం ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సాధారణ పరిస్థితి నెలకొనే వరకు పోలీసుల తనిఖీలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version