Parliament Sessions: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికార, ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. రెండో దఫా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు సోమవారం ఉదయం 10గంటలకు పార్లమెంట్ ప్రాంగణంలో సమావేశం కానున్నాయి. ముఖ్యంగా అదానీ-హిండెన్‌బర్గ్ అంశంపై ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టేందుకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ నేత కే సురేష్ పేర్కొన్నారు. దీనిపై సంయుక్త పార్లమెంటరీ సంఘం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఫైనాన్స్ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. విపక్షాలు అదానీ వ్యవహారం, దర్యాప్తు సంస్థల దాడులను లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నాయి.
Read Also: Militants Surrender: అరుణాచల్‌లో ఆయుధాలతో లొంగిపోయిన 15 మంది ఉగ్రవాదులు
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.ఆర్థికబిల్లు ఆమోదమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ తెలిపారు. ప్రతిపక్షాల డిమాండ్లపై స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ సమావేశాల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జమ్మూకశ్మీర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉందన్న సంగతి తెలిసిందే.