Site icon NTV Telugu

Godavari River Tragedy: గోదావరిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు.. ఒక మృతదేహం లభ్యం!

Godavari River Tragedy

Godavari River Tragedy

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని లంక వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన 8 మంది యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము వరకు గజ ఈత గాళ్లు, వలల సాయంతో ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారులు గోదావరిని జల్లెడ పట్టారు. ప్రమాదం జరిగిన సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం వడ్డే మహేష్‌గా గుర్తించారు. ఇంకా ఏడుగురి యువకుల ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

శేరిలంకకు చెందిన కొండేపూడి నాగరాజు-చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమజ్యోతి రజస్వల వేడుకకు ఆమె సోదరుడు పోలిశెట్టి అభిషేక్‌ తన స్నేహితులను పిలిచాడు. అభిషేక్‌ ఆహ్వానంపై పలు ప్రాంతాలకు చెందిన మిత్రులు, బంధువులు వేడుకకు హాజరయ్యారు. భోజనాలు ఆరగించిన తరువాత సరదాగా గౌతమి గోదావరిలో స్నానం చేసేందుకు 11 మంది వెళ్లారు. ముందుగా ఒక యువకుడు స్నానానికి దిగి.. కాస్త లోపలికి వెళ్ళాడు. అక్కడ లోతుగా ఉండడంతో అతడు మునిగిపోయాడు. అది చూసిన మరో ముగ్గురు అతడిని రక్షించేందుకు గోదావరిలోకి దిగి మునిగిపోయారు. అలా ఒకరి తరువాత ఒకరు గోదావరిలోకి వెళ్లి గల్లంతయ్యారు.

Also Read: Mahanadu 2025: నేటి నుంచి టీడీపీ మహానాడు.. ఈరోజటి కార్యక్రమాలు ఇవే!

ప్రమాదాన్ని గ్రహించిన ముగ్గురు యువకులు నదిలోకి దిగకుండా సురక్షితంగా బయటపడ్డారు. యువకులు స్థానికులకు సమాచారం ఇవ్వడంతో.. హుటాహుటిన అందరూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసు అధికారులు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగింది. ప్రమాదం జరిగిన సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతయిన ఎనిమిది మందిలో నలుగురు రెండు కుటుంబాలకు చెందిన సోదరులు. మహేష్, రాజేష్.. క్రాంతి కిరణ్, పాల్ అభిషేక్ సొంత సోదరులు. దీంతో యువకుల కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. కమిని లంక పాయ దగ్గర గోదావరి లోతుగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. యానాం దగ్గర గోదావరి, సముద్రం పోటు కారణంగా నీళ్లు వెనక్కి ఫోర్స్ గా వస్తాయని మత్స్యకారులు అంటున్నారు.

Exit mobile version