NTV Telugu Site icon

Science Day Celebrations: నేను కూడా సైన్స్‌ విద్యార్థినే.. అధ్యాపకుడిగా పనిచేశా: రాజ్‌నాథ్‌ సింగ్‌

Rajnath Singh

Rajnath Singh

‘జాతీయ సైన్స్‌డే’ సందర్భంగా హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న నేషనల్‌ సైన్స్‌ డే ఎగ్జిబిషన్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఓపెన్ టాప్ జీపులో స్టేడియంలో ఉన్న స్కూల్ అండ్ కాలేజ్ విద్యార్థులందరికీ కేంద్రమంత్రి, సీఎం అభివాదం చేశారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సర్ సీవీ రామన్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డీఆర్‌డీవో, డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ ఉత్పత్తులకు చెందిన 200 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. విజ్ఞాన్‌ వైభవ్‌ ప్రదర్శనలో రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ తాను కూడా సైన్స్‌ విద్యార్థినే అని చెప్పారు.

‘సర్‌ సీవీ రామన్‌ ఫిబ్రవరి 28న రామన్‌ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. నోబెల్‌ గ్రహీత రామన్‌ గౌరవార్థం ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్‌ దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. నేను కూడా సైన్స్‌ విద్యార్థినే. కొన్నాళ్లు సైన్స్‌ అధ్యాపకుడిగా కూడా పనిచేశాను. ఇంతటి విద్యార్థి సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మానవ పరిణామాన్ని, సైన్స్‌ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలి’ అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘దేశం రక్షణ బాధ్యత యువతి, యువకులపై ఉంది. రక్షణ శాఖ దేశాన్ని కాపాడంలో కీలక పాత్ర వహిస్తుంది. మిస్సైల్స్ తయారీ చేసే పరిశ్రమలు డీఆర్‌డీఎల్, బీడీఎల్, డీఆర్‌డీవో తెలంగాణాలో ఉండడం సంతోషం. ప్రతియేటా మెకానికల్ & ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న లక్షకు పైగా విద్యార్దులు ఉద్యోగం కోసం అమెరికా వెళుతున్నారు. తెలంగాణలో ఈరోజు ఏర్పాటు చేసిన డీఆర్‌డీవో ఎగ్జిబిషన్ ఎంతగానో దోహదపడుతుంది. బెంగళూరు తరహాలో తెలంగాణ రాష్ట్రంలోనూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖ కారిడార్లు ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.