ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ స్పీడందుకుంది. కరోనా వ్యాప్తి కూడా తగ్గుముఖం పట్టింది. దాంతో బడి తలుపులు తెరుచుకుంటున్నాయి. ఈ ట్రెండ్ అన్ని దేశాలలో కనిపిస్తోంది. స్థానిక పరిస్థితులకు అనుగునంగా 50 కి పైగా దేశాలలో ఇప్పటికే స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి.
తెరుచుకుంటున్న బడి తలుపులు
దాదాపు ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి మానవాళిని పట్టి పీడిస్తోంది. అన్ని రంగాలపై అది తీవ్ర ప్రభావం చూపింది. కరోనా దెబ్బకు కుదేలైన వాటిలో విద్యా ఒకటి. పిల్లలు చదువు కోల్పోయారు. ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసే వేలాది మంది టీచర్లు వీధిన పడ్డారు. అలాగే చిన్న మధ్య తరగతి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చాలా పాఠ శాలలు శాశ్వతంగా మూతపడ్డాయి.
50 కి పైగా దేశాలలో స్కూళ్లు రీ ఓపెన్
కరోనా వల్ల 15 నెలల నుంచి బడి బంద్. ఆన్‌లైన్ తరగతులున్నా అందరికీ అందుబాటులో లేవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పేద పిల్లలు. వారు పూర్తిగా చదువుకు దూరమయ్యారు. ఆన్ లైన్ బోధన తరగతి గదికి ఎప్పుడూ సమానం కాలేదు. స్కూల్ వాతావరణం పిల్లలకు చదువుతో పాటు మానసిక వికాసాన్ని అందిస్తుంది. ఐక్యరాజ్యసమితి రిపోర్టు ప్రకారం పాఠశాలలు మూసివేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదహారు కోట్ల మంది పిల్లల విద్య ప్రభావితమైంది. అంతే కాదు భవిష్యత్తులో పిల్లల పోషకాహారం, విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులపై కూడా కరోనా ప్రతికూల ప్రభావం కనిపించనుంది.
గ్రామీణ ప్రాంత పిల్లలపై తీవ్ర ప్రభావం
చాలా దేశాలలో గత నెలలోనే పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. రెండు నుంచి పదకొండేళ్ల మధ్య వయస్సు పిల్లలకు కరోనా వచ్చే ప్రమాదం చాలా తక్కువ. అందుకే వారిని బడికి పంపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా పాఠశాలల తలుపులు మెల్ల మెల్లగా తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలలో స్కూళ్లు బిగినయ్యాయి. మరి కొన్ని రాష్ట్రాలలో తిరిగి తెరిచే ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తగు జాగ్రత్తలతో పాఠశాలలు తెరిచే ప్రయత్నం చేస్తున్నారు.
16 కోట్ల విద్యార్థులపై కరోనా ప్రభావం
స్కూళ్లు మూతపడి ఇప్పటికే చాలా రోజులైంది. ఇంకా మూసి ఉంచితే దాని ప్రభావం విద్యార్థులపై ప్రతికూలంగా ఉండే ప్రమాదం ఉంది. ఇప్పటికే బడిలేక పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. వారితో ఇంటి పనులు చేయిస్తున్నారు. ముఖ్యంగా నిరుపేద, బలహీన వర్గాల పిల్లలు దీని బారిన ఉఉఉ. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలు తెరవటం తప్పనిసరి.ఇదే సమయంలో కోవిడ్ సమస్య తీవ్రతను విస్మరించరాదు. తగు జాగ్రత్తలు పాటించాల్సిందే.
బడిలేక ఇంటికే పరిమితమైన విద్యార్థులు
విద్యార్థులు, ఉపాధ్యాయులు, అనుబంధ సిబ్బందికి టీకా తప్పనిసరి. పాఠశాలలో ఉన్నంత వరకూ మాస్కులు ధరించడంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకొనేలా జాగ్రత్తలు తీసుకోవాలి. క్లాస్ లోకి ఎంటరయ్యే ముందు టెంపరేచర్ చూడాలి. నిరంతం ర్యాండమ్ టెస్టులు నిర్వహించాలి. ప్రతి పాఠశాలలో హెల్త్ కిట్స్ సమకూర్చాలి.
పిల్లలతో ఇంటి పనులు చేయిస్తున్న పేరెంట్స్
కొవిడ్ ప్రొటోకాల్ పాటించాల్సిందే
అన్ని పాఠశాలలు విధిగా కొవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటించాలి. ప్రతి స్కూల్‌లో కనీసం రెండు ఆక్సిజన్ కాన్‌సంట్రేటర్లు ఏర్పాటు చేయాలి. అత్యవసర పరిస్థితి ఎదురైతే ప్రాథమిక వైద్యాన్ని అందించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు శానిటైజర్, ఫేస్‌మాస్కులు క్రమం తప్పకుండా పంపిణీ చేయాలి. ప్రాధమిక ఆరోగ్య సిబ్బంది తరచూ పాఠశాలలను సందర్శించి తనిఖీ చేయాలి. ఇలా ఇంకా ఎన్నో సిపార్సలు చేసింది కేంద్ర ప్రభుత్వం.
మన దేశంలో తొలగని థర్డ్ వేవ్ భయాలు
అనవసర భయాలు వద్దంటున్న నిపుణులు
వివిధ ప్రపంచ దేశాలతో పాటు మన దేశ వాసులను కూడా థర్డ్ వేవ్ భయాలు పీడిస్తున్నాయి. దాని ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఫస్ట్, సెకండ్ వేవ్ లను పరిశీలిస్తే పిల్లలపై తక్కువ ప్రభావం కనిపించింది. థర్డ్ ,ఫోర్త్ వేవ్ చూసిన దేశాలలో కూడా పిల్లలు పెద్దగా కరోనా బారిన పడలేదు. కొత్త వేరియంట్లు కూడా వారిని ఏమీ చేయలేవు. ఎలా చూసినా పిల్లలకు కరోనాతో పెద్దగా ప్రమాదం లేదని అర్థమవుతుంది. దీనిని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. అనవసర భయాలకు లోనుకావద్దు.
దాదాపు 50% టీచర్లకు టీకాలు పూర్తి
మన దేశంలో కనీసం 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ నెలలో పాఠశాలలను తిరిగి తెరవడానికి ప్లాన్ చేస్తున్నాయి. కోవిడ్ కేసులు తక్కువుగా ఉండటం, అలాగే సగానికి పైగా టీచర్లు టీకా వేయించుకోవటంతో ప్రభుత్వాలు ఈ నిర్ణయానికి వచ్చాయి. దేశవ్యాప్తంగా దాదాపు 50% టీచర్లకు టీకాలు వేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
దేశ వ్యాప్తంగా 15 లక్షల పాఠశాలలు మూసివేత
ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ప్రారంభించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫారసు చేసినప్పటికీ దాదాపు అన్ని రాష్ట్రాలు పై తరగతి విద్యార్థులకు మాత్రమే స్కూళ్లు తెరవాలని యోచిస్తున్నాయి. మార్చి 2020 లో దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా పాఠశాలలు తలుపులు మూతపడ్డాయి. సెకండ్ వేవ్ కి ముందు చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే పాఠశాలలు తెరిచారు. అప్పటి నుండి 25 కోట్లకు పైగా పాఠశాల పిల్లలు ఆన్‌లైన్ , దూర విద్యపై ఆధారపడ్డారు. పేద విద్యార్థులు ఏడాది పాటు విద్యను కోల్పోయారు.
హర్యానాలో మొట్ట మొదటి ఫేస్ టూ ఫేస్ క్లాసులు
ఎనిమిది రాష్ట్రాలలో ఈ నెలలో పాఠశాలలు తెరుచుకున్నాయి. దేశంలో మొట్టమొదటగా హర్యానాలో 9 నుండి 12 వ తరగతి వరకు తొలి ఫేస్ టూ ఫేస్ క్లాసులు ప్రారంభమయ్యాయి. జూలై 16 నుంచి వీటిని ప్రారంభించారు. తరువాత నాగాలాండ్ 11, 12 తరగతులకు జూలై 26 నుంచి అనుమతించింది.పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, లక్షద్వీప్ లో ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే అన్ని తరగతులకు పాఠశాలను తిరిగి తెరిచాయి. మిగిలిన మూడు ఉన్నత పాఠశాలలకు మాత్రమే అనుమతించాయి.
నాగాలాండ్ లో జూలై 26న ప్రారంభమైన క్లాసులు
ఆగస్టు 16 నుంచి స్కూళ్లు తెరవాలని ఆంధ్రప్రదేశ్ యోచిస్తోంది. అందుకు కావాల్సిన కోవిడ్ ప్రోటోకాల్ కు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎనిమిది రాష్ర్టాలే కాకుండా 9, 10 తరగతులతో పాటు11, 12 తరగతులకు సమానమైన ప్రీ-యూనివర్శిటీ కోర్సులను ఆగస్టు 23 నుంచి ప్రారంభించాలని కర్ణాటక నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి తమిళనాడు ప్రభుత్వ తొమ్మిది నుంచి పన్నెండు తరగతులను తిరిగి ప్రారంభించనుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆగస్టు 16 నుండి తరగతులను పునప్రారంభించాలని ఉత్తర ప్రదేశ్ యోచిస్తోంది.
ఆగస్టు 16 నుంచి ఎపీలో స్కూళ్లు రీ ఓపెన్
ఒడిశా జూలై నుండి సెప్టెంబర్ వరకు దశలవారీగా పాఠశాలలను తిరిగి తెరవనుంది. మహారాష్ట్ర ఆగష్టు 17 న పాఠశాలలను పునప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం . గ్రామీణ ప్రాంతాల్లో 5 వ తరగతి నుంచి, పట్టణ ప్రాంతాలలో 8 వ తరగతి నుంచి ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయి. అయితే కోవిడ్ కేసులు తక్కువగా ప్రాంతాలకు మాత్రమే ఇది పరిమితం.
ఆగస్టు 23 నుంచి కర్నాటకలో బడులు
ప్రైమరీ స్కూల్ సెక్షన్లను ముందు తెరిస్తే బాగుంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ముందు పాఠశాలల సిబ్బందికి టీకాలు వేయించాలి. ఉన్నత పాఠశాల విద్యార్థులకు టీకా వేసే వయస్సు రాలేదు. అంతకన్నా కింది తరగతి పిల్లలకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తక్కువ. ఈ కారణాలతోనే ఈ సిఫార్సు చేసింది.
ఏదేమైనా మన దేశంలో రాబోయేది పరీక్షా సమయమే. థర్డ్ వేవ్ కట్టడి చేయటంలో అనుసరించే విధనాలపైనే బడి పిల్లల భవిష్యత్తు ..పెద్దల భవిష్యత్తు ఆధారపడి ఉందనటంలో సందేహం లేదు!