School Bus Accident : అప్పటివరకు సరదాగా స్కూల్లో బాలల దినోత్సవం జరుపుకున్న విద్యార్థులకు అనుకోని సంఘటన ఎదురవడంతో షాక్ తిన్నారు. స్కూల్ పిల్లలను పిక్నిక్‌కు తీసుకెళ్లిన బస్సు ఉన్నట్లుంది బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థితో పాటు మరో ఉపాధ్యాయుడు మరణించాడు. ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్ జిల్లాలో సంఘటన జరిగింది. నయగావ్ భట్టే పరిధిలోని కిచ్చ ప్రాంతానికి చెందిన వేదారం స్కూల్ విద్యార్థులను బాలల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని పిక్నిక్‌కు తీసుకెళ్లారు. 51 మంది పిల్లలతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో పిల్లల హాహాకారాలు అక్కడి స్థానికులను కదిలించాయి. ప్రమాదాన్ని గమనించిన వారు సహాయం చేసేందుకు వెంటనే ముందుకు వచ్చారు. అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో ఒక బాలిక, ఒక టీచర్ చనిపోయారు. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థిని, టీచర్ మరణంపై సంతాపం తెలిపారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.