SC Categorization: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ నేటి (సోమవారం) నుంచి అధికారికంగా అమలులోకి రానుంది. ఈ వర్గీకరణ అమలుకు రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఎంపిక చేసుకోవడం విశేషం. గడిచిన 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి ప్రతిఫలంగా, ఈ కీలక నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు ఉత్తర్వుల తొలి ప్రతిని సీఎం రేవంత్ రెడ్డికి అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
ఈ ఉపసంఘ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించగా.. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ క్షితిజ్ మరికొందరు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని.. అయితే, రాష్ట్రంలో ఎస్సీ జనాభా 17.5 శాతానికి పెరిగిందని అన్నారు. అదేవిధంగా, ఎస్సీ వర్గీకరణలో క్రీమీలేయర్ అమలు చేయాలన్న సూచనను ప్రభుత్వం ఇప్పటికే తిరస్కరించిందని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే, జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలోని కమిషన్ 199 పేజీల నివేదికను ప్రభుత్వంకు అందించింది. ఇందులో మొత్తం 59 ఎస్సీ కులాలపై వివరణాత్మకంగా విశ్లేషణ ఉంది. 2024 నవంబర్ 11న బాధ్యతలు చేపట్టిన ఈ కమిషన్ అతి కొద్దీ రోజుల్లో ఈ నివేదికను సిద్ధం చేసింది.
ఇందులో భాగంగా బహిరంగ విచారణలు, పర్యటనలు ద్వారా ప్రజల నుంచి వచ్చిన 4,750 విజ్ఞప్తులతో పాటు.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా వచ్చిన 8,681 వినతులను పరిశీలించి పూర్తి నివేదిక రూపొందించారు. ఈ నివేదికలో 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించారు అధికారులు.
ఇక ఈ వర్గీకరణ విధానంలో గ్రూప్-1లో అత్యంత వెనుకబడిన కులాలు (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ ప్రాతినిధ్యం పరంగా), గ్రూప్-2లో మధ్యస్థ స్థితిలో ఉన్న లబ్ధిపొందిన కులాలు, గ్రూప్-3లో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు ఉండనున్నాయి. ఈ వర్గీకరణతో ఎస్సీ ఉపకులాల మధ్య న్యాయం జరిగే అవకాశం ఉందని, ప్రయోజనాల పంపిణీలో సమతుల్యత తీసుకురావడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.