Sarfaraz Khan: క్రికెట్ ప్రపంచంలో ఒక యువ క్రికెటర్ చరిత్ర సృష్టించాడు. టీమ్ ఇండియాలోకి అడుగుపెట్టడానికి చాలా కష్టపడుతున్న ఆ వ్యక్తి టీమిండియా దిగ్గజాలకు కూడా సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. సర్ఫరాజ్ ఖాన్. ఈ దేశవాళీ సీజన్‌లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మనోడు అన్ని ఫార్మాట్లలో కూడా అద్భుతంగా పరుగులు చేస్తున్నాడు. ఇది నిజంగా IPL 2026 కి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభసూచకం. ఫస్ట్-క్లాస్ క్రికెట్ అయినా, లిస్ట్ A అయినా, T20 అయినా, సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్ పరుగుల వరద పారిస్తుంది. తాజాగా సర్ఫరాజ్ ఖాన్ భారత క్రికెట్‌లో మరే ఆటగాడు సాధించని ఘనతను సాధించాడు. ఇంతకీ ఆ ఘనత ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: ఆరోగ్యానికి చికెన్ మంచిదా? మటన్ మంచిదా? నిజం తెలుసుకోండి.!
సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫేజ్ 2లో శుభారంభం చేశాడు. తాజాగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 219 బంతుల్లో 227 పరుగులు చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఇది అతని ఐదవ డబుల్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌లో ఖాన్ 5 వేల ఫస్ట్-క్లాస్ పరుగులను కూడా చేరుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ 19 ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టడం ద్వారా ముంబైని బలమైన స్థితిలో నిలిపాడు. అంతకుముందు విజయ్ హజారే ట్రోఫీ (లిస్ట్ ఎ) లో గోవాపై కూడా 75 బంతుల్లోనే 157 పరుగులు నమోదు చేశాడు. ఈ ఇన్సింగ్స్‌లో 9 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. లిస్ట్ ఎలో ఇది అతని అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచిపోయింది.
అదనంగా సర్ఫరాజ్ ఖాన్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (T20 టోర్నమెంట్)లో అస్సాంపై 47 బంతుల్లో 100 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు, ఇది అతని తొలి T20 సెంచరీగా నిలిచింది. కేవలం 52 రోజుల వ్యవధిలోనే సర్ఫరాజ్ ఖాన్ ఈ మూడు పెద్ద ఇన్నింగ్స్‌లను తన పేరిట లిఖించుకున్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ, లిస్ట్ A క్రికెట్‌లో 150 పరుగులు, T20 క్రికెట్‌లో ఒకే దేశీయ సీజన్‌లో సెంచరీ సాధించిన మొదటి భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో మూడవ ఆటగాడిగా నిలిచి నయా రికార్డును నెలకొల్పాడు.
దిగ్గజాల సరసన నిలిచిన సర్ఫరాజ్ ఖాన్..
ఈ అద్వితీయ విజయాన్ని గతంలో ముగ్గురు ఇంగ్లీష్ ఆటగాళ్లు మాత్రమే సాధించారు. ఈ ఘనతను డేనియల్ బెల్-డ్రమ్మండ్ 2016, 2023లో సాధించగా, అలెక్స్ హేల్స్ 2017లో సాధించారు. సర్ఫరాజ్ ఇప్పుడు ఈ ఎలైట్ క్లబ్‌లో చేరాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ ఉన్న ఫామ్.. భారత టెస్ట్ జట్టులోకి తిరిగి రావాలనే డిమాండ్లకు మరింత బలాన్ని అందిస్తుంది. నిజానికి గతంలో సర్ఫరాజ్ ఖాన్ ఈ ఫార్మెట్‌లో అద్భుతంగా రాణించాడు, కానీ చాలా కాలంగా జట్టులో చోటు సంపాదించుకు కోలేకపోతున్నాడు.