NTV Telugu Site icon

Medaram Jatara: సారలమ్మకు స్వాగతం పలికిన పగిడిద్దరాజు, గోవిందరాజు.. నేడుగద్దెపైకి సమ్మక్క..

Medaram

Medaram

Saralamma Sammakka: మేడారం మహా జాతరలో తొలి ఘట్టం నిర్విఘ్నంగా పూర్తైంది. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ నిన్న (బుధవారం) అర్ధరాత్రి 12.12 గంటలకు గద్దెను అలంకరించారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలి వచ్చి మేడారం గుడి దగ్గరకు సారలమ్మకు ఘన స్వాగతం పలికారు. సారలమ్మను కనులారా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. సారలమ్మను తోడ్కోని వచ్చే ప్రధాన వడ్డె (పూజారి) కాక సారయ్య సహా ఆయనను అనుసరించే ఇతర వడ్డెలు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read Also: TDP- Janasena Meeting: నేడు టీడీపీ- జనసేన సమన్వయ కమిటీ భేటీ.. సీట్ల పంపిణీపై కీలక చర్చ

ఇక, పూజల తర్వాత కన్నెపల్లి నుంచి 16 మంది ఆడబిడ్డలు వచ్చి సంప్రదాయం ప్రకారం డోలి విన్యాసాలతో సమ్మక్క-సారలమ్మ కొలువుదీరే గద్దెలపై ముగ్గులు వేసి కంకవనానికి కంకణాలు కట్టారు. ఇవాళ, మధ్యాహ్నం 3 గంటల నుంచే కన్నెపల్లి సారలమ్మ గుడి దగ్గర డోలి విన్యాసాలు, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి పరిషత్‌, సారలమ్మ యువజన సంఘం బృందాల సారథ్యంలో కళా ప్రదర్శనలు జరగనున్నాయి. అదే సమయంలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య సహా ఇతర పూజారులు సారలమ్మ గుడిలో వారి ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు నిన్వహించనున్నారు.

Read Also: IND vs ENG: రాంచీ టెస్టు.. భారత్ తరపున మరో ఆటాగాడు ఎంట్రీ!

అలాగే, జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం ఇవాళ జరగనుంది. చిలకలగుట్టపై నుంచి కుంకుమభరిణె రూపంలో ఉండే సమ్మక్కను పూజారులు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించబోతున్నారు. సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అయితే, జాతర మొదటిరోజే గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారింది. రాష్ట్రంతో పాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి జనం తరలిరావడంతో మేడారం పరిసరాలు వనమా? జనమా అనేలా మారిపోయాయి. వేలాది మంది భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బారులు దీరడంతో క్యూలైన్లు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఇక, కేంద్ర పర్యటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు మేడారానికి రానున్నట్టు అధికారులు తెలిపారు.