Site icon NTV Telugu

Sankranti 2025: కోనసీమలో జోరుగా కోడిపందేలు.. మొక్కుబడిగా పందెం రాయుళ్ల అరెస్టు!

Rooster Fight

Rooster Fight

2025 సంక్రాంతి పండుగకు నెల రోజులు ముందే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పందెం కోళ్లు సై అంటున్నాయి, పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పందెం కోళ్ళు బరిలోకి దిగుతున్నాయి.. సై అంటే సై అంటూ కాళ్లు దువ్వుతున్నాయి. కోనసీమ ప్రాంతంలోని కొబ్బరి తోటల్లో జోరుగా కోడిపందాలను నిర్వహిస్తున్నారు. విచ్చలవిడిగా బరులు గీసి కోడిపందేలు జరుపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు పందెం కోళ్లు తీసుకుని కోనసీమ ప్రాంతానికి వస్తున్నారు. కొన్నిచోట్ల పెద్ద స్థాయిలోనే కోడిపందేలు జరుగుతున్నాయి.

ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు మూడు రోజులు కోడిపందేలు నిర్వహించడం ఆనవాయితిగా వస్తుంది. ఇలా కాకుండా ఈసారి పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులకు సవాల్ విసిరినట్టుగా పందేలు కొనసాగిస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని మాకేమిటి అడ్డు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో కోనసీమ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు చేపట్టారు. ఆత్రేయపురం మండలం ఉచ్చిలి వద్ద కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పది మంది పందెం రాయుళ్లును అరెస్టు చేశారు. 40 పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరు వేల రూపాయాలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
కోడిపందేలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని వచ్చిన సమాచారంపై ఈ దాడి నిర్వహించామని రావులపాలెం సిఐ సిహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.

సంక్రాంతి మూడు రోజులు లక్షల్లో కోడిపందేలు నిర్వహించడానికి వివిధ ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉచ్చిలి గ్రామ శివారు ప్రాంతంలోని గోదావరి ఏటుగట్టు దిగువున శిబిరం ఏర్పాటు చేశారు. ఇప్పటి నుండే కోడిపందాలు నిర్వహించాలన్న లక్ష్యంతోనే.. ఆయా జిల్లాల నుండి సైతం పందెం రాయుళ్లు ఇక్కడకు విచ్చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ దాడిలో కోడిపందాలకు ఏర్పాట్లు చేస్తున్న పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలో అక్రమ జూదాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను సహించబోమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత ఘటనా స్థలం నుండి 40 కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ.. పోలీసుల ఆధీనంలోకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అలాగే అసలైన నిర్వాహకులను వదిలేసి మొక్కుబడిగా కొంతమంది పైనే కేసులు కట్టారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇక్కడ దాదాపు 40 మంది వరకు నిర్వాహకులు ఉంటే.. పది మందిని అరెస్టు చేయడం వెనక భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోడిపందాలకి అనుమతి లేదని పూర్తిస్థాయి నిషేధం అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ.. కోనసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా కోడిపందాలు కొనసాగుతున్నాయి.

సంక్రాంతి పండుగ సమయంలో రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు మూడు రోజులు పాటు కోడిపందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే అవకాశంగా చేసుకుని విచ్చలవిడిగా కోడిపందేలతో పాటు గుండాటలు, జూదం, ఇతర అసాంఘిక వ్యవహారాలకు పందెంరాయుళ్లు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఏటా కోడిపందాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించడం, చివరికి పోలీసు ఆంక్షలు పక్కకి పోయి.. కత్తి కట్టిన కోడిపందేలే జోరుగా సాగడం పరిపాటిగా జరుగుతుంది. కానీ ఈ ఏడాది నెల రోజుల ముందు నుండే కోడిపందేలు బరులు సిద్ధం చేయడం, వివిధ జిల్లాల నుండి పందెం రాయుళ్లు ఇక్కడకు రావడం పోలీసులకు తలనొప్పి కలిగిస్తోంది. ఇప్పుడే ఇంత విచ్చలవిడిగా పందాల రాయుళ్లు బరులు వేస్తుంటే.. పండుగ సమయంలో ఇంకా ఎంతలా రెచ్చిపోతారోనన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. దీనివల్ల యువత పక్కదారి పడతారని భయాందోళనలు కలిగిస్తున్నాయి. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి పూర్తిస్థాయిలో ముందుగా కోడిపందాలు జరగకుండా కట్టాడి చేయాలని అంతా కోరుతున్నారు.

Exit mobile version