NTV Telugu Site icon

Sanju Samson: సంజూ.. నెదర్లాండ్స్ లేదా ఐర్లాండ్ తరఫున ఆడు! 2027 ప్రపంచకప్‌లో ఆడుతావ్

Sanju Samson Shot

Sanju Samson Shot

Indian Fans Slams BCCI over Sanju Samson: ప్రపంచకప్ 2023 అనంతరం సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌ ఆడేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ సిరీస్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ప్రపంచకప్ 2023లో ఆడిన సీనియర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. కుర్రాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే చాలాకాలం నుంచి జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సంజూకు బీసీసీఐ సెలెక్టర్లు టీ20 జట్టులో కూడా చోటు ఇవ్వలేదు. దాంతో అతడి పేరు సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్ అవుతోంది.

భారత్ తరఫున ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారి సంజూ శాంసన్‌ రాణించాడు. అయినా కూడా బీసీసీఐ అతడికి అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదు. 2015లో అరంగేట్రం చేసిన సంజూ.. ఇప్పటివరకు 13 వన్డేలు, 24 టీ20లు మాత్రమే ఆడాడంటే బీసీసీఐ అతనిపై ఎంత వివక్ష చూపుతుందో ఇట్టే అర్ధమవుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సంజూ ఆడతాడని అనుకున్నా.. అది జరగలేదు. వన్డే ప్రపంచకప్ కోసం రెడీ చేస్తున్నామని, అందుకే వన్డేలు ఆడిస్తున్నామని బీసీసీఐ చెప్పింది. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి టీ20ల్లోనే ఆడించింది. ఆసియా కప్‌ 2023లో ఆడిస్తారనుకుంటే.. టోర్నీకి కూడా ఎంపిక చేయలేదు. కనీసం ఆసియా క్రీడలకు పంపుతారనుకున్నా అది జరగలేదు.

ప్రపంచకప్‌ 2023 తర్వాత ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీసులో అయినా సంజూ శాంసన్‌కు అవకాశం ఇస్తారనుకున్నా.. మళ్లీ నిరాశే ఎదురైంది. టీ20 జట్టులో సంజూ పేరు లేకపోవడంతో భారత క్రికెట్ అభిమానులు బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్‌ ఏం పొడిచాడని సారథిగా ఎంపిక చేశారని బీసీసీఐపై మండిపడుతున్నారు. సూర్య కంటే బాగా ఆడే సంజూ ఏం పాపం చేశాడని ట్వీట్స్ చేస్తున్నారు.

Also Read: Rohith Sharma: బాధపడొద్దు రోహిత్‌.. గొప్ప నాయకులకు కూడా చెడ్డ రోజులు ఉంటాయి: రాధికా

‘సంజూ శాంసన్‌ స్థానంలో అర్హత లేని ఆటగాళ్లు జట్టులోకి వస్తున్నారు’, ‘బీసీసీఐ రాజకీయాల కారణంగానే సంజూకు భారత జట్టులో చోటు దక్కడం లేదు’, ‘ఏం చేస్తే సంజూకు జట్టులో చోటు దక్కుతుందో బీసీసీఐ చెప్పాలి?’ అని ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఓ అభిమాని అయితే రిటైర్మెంట్ ఇచ్చేసి.. నెదర్లాండ్స్ లేదా ఐర్లాండ్ తరఫున ఆడు అని సలహా ఇచ్చాడు. ‘రిటైర్ అయ్యి.. అమెరికా, నెదర్లాండ్స్ లేదా ఐర్లాండ్‌కు ఆడు. వన్డే ప్రపంచకప్ 2027లో టీమిండియాకు వ్యతిరేకంగా ఓ కెప్టెన్‌గా ఎదుర్కో’ అని ట్వీట్ చేశాడు.