NTV Telugu Site icon

Sanju Samson: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో నేను ఆడాల్సింది.. చివరి నిమిషంలో తప్పించారు: శాంసన్

Sanju Samson

Sanju Samson

టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో తాను ఆడాల్సిందని, చివరి నిమిషంలో తుది జట్టు నుంచి తనను తప్పించారని టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తెలిపాడు. తుది జట్టు నుంచి తప్పించినందుకు కెప్టెన్ రోహిత్ శర్మ తనకు క్షమాపణలు చెప్పాడన్నాడు. తుది జట్టులో లేకపోవడంతో తాను కాస్త నిరాశకు గురయ్యానని, కానీ ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నో ఎదుర్కొన్నానని సంజూ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన సంజూ.. ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. రిషబ్ పంత్ జట్టులో ఉండడంతో అతడికి చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే.

స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజూ శాంసన్ టీ20 ప్రపంచకప్ రోజులను గుర్తుచేసుకున్నాడు. ‘టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో నాకు ఆడే అవకాశం వచ్చింది. ఫైనల్‌కు ముందు రోజు తుది జట్టులో ఉన్నావని, చెప్పి.. మ్యాచ్‌కు సిద్దం కావాలన్నారు. నేను బాగా ప్రాక్టీస్ చేశా. కానీ టాస్‌కు 10 నిమిషాల ముందు జట్టులో ఏ మార్పులు లేవని చెప్పారు. నేను కాస్త నిరాశకు గురయ్యాను కానీ.. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నో ఎదుర్కొన్నా. వార్మప్‌ల సమయంలో రోహిత్ నన్ను పక్కకు తీసుకు వచ్చి తప్పించాడనికి గల కారణాన్ని వివరించే ప్రయత్నం చేశాడు’ అని సంజూ తెలిపాడు.

Also Read: CWG 2026: కామన్వెల్త్ క్రీడల నుంచి 9 గేమ్స్ ఔట్.. లిస్ట్‌లో క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్!

‘శాంసన్.. నీకు అర్థమైందా? అని రోహిత్ శర్మ నాతో అన్నాడు. ముందు మ్యాచ్ గెలవడంపై దృష్టి పెడదాం, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు అని నేను అన్నాడు. నీ మనసులో నన్ను తిట్టుకుంటున్నావ్ కదా?, నువ్వు సంతోషంగా లేవనే విషయం నాకు అర్థమవుతుందని రోహిత్ నాతో అన్నాడు. ”ఓ ప్లేయర్‌గా ప్రపంచకప్ ఫైనల్ ఆడాలని ఎవరికి ఉండదు, ఈ సమయంలో నువ్వు నాకు వివరించడం సంతోషంగా ఉంది. టాస్‌కు 10 నిమిషాల ముందు మ్యాచ్ ఆడని ఓ ఆటగాడితో మాట్లాడుతున్నావ్ అంటే నువ్వో గొప్ప లీడర్‌. నీలాంటి సారథితో ప్రపంచకప్ ఫైనల్ ఆడే అవకాశం దక్కకపోవడం బాధించే విషయం” అని నేను జవాబిచ్చాను. రోహిత్ స్థానంలో నేను ఉన్నా అలా మాట్లాడుండకపోయేవాడిని. రోహిత్ భాయ్ గొప్ప కెప్టెన్’ అని సంజూ శాంసన్ ప్రశంసల వర్షం కురిపించాడు.