విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఓ ఇసుక లారీ భీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం 6:30 గంటల సమయంలో నోవాటల్ పక్కన ఎత్తుగా ఉన్న రోడ్డు నుండి బీచ్ రోడ్డులోకి ఇసుక లోడ్ తో వస్తున్న లారీ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. దీంతో ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీకొని చిల్డ్రన్ పార్కులోకి లారీ దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తున్న మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి.
ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మంది వాకర్స్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో ఈ ప్రాంతంలోనే రెండు ప్రమాదాలు చోటు చేసుకోగా.. ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో లారీ ముదుభాగం పూర్తిగా దెబ్బతింది. ఈఘటనతో ఆర్కే బీచ్‌లో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు లారీని తీసేందుకు చాలా శ్రమించారు. లారీ భీభత్సంకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.