Sanatan row: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం చెన్నైలో నిరసనను నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర విభాగం తెలిపింది. ఈ వ్యవహారంలో మరో మంత్రి పీకే శేఖర్‌బాబును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. సనాతన ధర్మ సదస్సులో హిందూ మత, ధర్మాదాయ శాఖకు నేతృత్వం వహిస్తున్న మంత్రి శేఖర్‌బాబు పాల్గొన్నారని, ఉదయనిధి తన ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించారని బీజేపీ పేర్కొంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరగనున్నాయి. తమిళనాడులోని అన్ని జిల్లాల్లో హిందూ ధర్మాదాయ శాఖ కార్యాలయాలను దిగ్బంధించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను చేపట్టనున్నారు. సనాతన్ ధర్మంపై ఉదయనిధికి ఘాటైన బదలిచ్చిన అన్నామలై.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని డీఎంకే ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కేబినెట్‌లో షెడ్యూల్డ్ కులాల సభ్యుల ప్రాతినిథ్యం గురించి ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 20 మంది సభ్యులు ఉండగా, స్టాలిన్ మంత్రివర్గంలో కేవలం ముగ్గురు మంత్రులు మాత్రమే ఉన్నారన్నారు. దీన్ని బట్టి ఏ పార్టీ వెనుకబడిన సమాజానికి అనుకూలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నారు.
Also Read: African Union Chairperson: భారత్ ఐదో “సూపర్ పవర్”..
తేనిలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చి 29 నెలలు అవుతోంది.. రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేశారో.. చట్టాలు పూర్తిగా కుప్పకూలాయని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని, మహిళలకు భద్రత లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల ద్వారా సంపాదించిన డబ్బు వారి పాలనలో పెరిగిందని ఆరోపించారు.
చెన్నై సదస్సులో మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని దోమలు, డెంగ్యూ, మలేరియా, జ్వరం, కరోనాతో పోల్చారు. కేవలం వ్యతిరేకించడమే కాకుండా దానిని నిర్మూలించాలన్నారు. ఈ నేపథ్యంసో ఉదయనిధి తన మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు, సినీ ప్రముఖులు డిమాండ్ చేశారు. గురువారం నాడు బీజేపీ ప్రతినిధి బృందం తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిని కలిసి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయనిధిపై కేసులు నమోదు చేయడంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ మెమోరాండం సమర్పించింది. డీఎంకే నాయకుడి వ్యాఖ్య ప్రతిపక్ష నాయకుల “హిందూ వ్యతిరేక” మనస్తత్వాన్ని వివరించడానికి మాత్రమే ఉపయోగపడిందని, కాషాయ పార్టీ ఇండియా కూటమిని కూడా వివాదంలోకి లాగింది.