NTV Telugu Site icon

Sachin Tendulkar: ఆ రికార్డు సాధించి నేటికి 14 ఏళ్లు.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి

Sachin

Sachin

సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారుండరు. అతనికి చరిత్ర పుటల్లో ప్రత్యేక పేరుంది. తన ఆటతో అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. సచిన్ ను ఇండియాలో క్రికెట్ దేవుడిగా పిలుస్తారు. కాగా.. క్రికెట్ కు సచిన్ చేసిన సేవలకు భారత ప్రభుత్వం భారతరత్నతో గౌరవించింది. ఇదిలా ఉంటే.. తన బ్యాట్ తో మొదటిసారి చరిత్ర సృష్టించిన రోజు ఈరోజు.. సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2010 ఫిబ్రవరి 24న క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా డబుల్ సెంచరీ చేశాడు. అప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ ఈ రికార్డును సాధించి మొనగాడిగా నిలిచాడు. సచిన్ వన్డే డబుల్ సెంచరీ సాధించినప్పుడు ఆయన వయసు 36 సంవత్సరాలు. ఈ మేరకు బీసీసీఐ సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీకి సంబంధించిన వీడియోను తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న క్రమంలో.. ఈ ఫీట్ సాధించాడు సచిన్ టెండూల్కర్. సిరీస్‌లోని రెండవ మ్యాచ్ 24 ఫిబ్రవరి 2010న గ్వాలియర్‌లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో.. ఓపెనర్లు సచిన్‌తో కలిసి సెహ్వాగ్ క్రీజులోకి వచ్చారు. కేవలం 25 పరుగుల స్కోరు వద్ద సెహ్వాగ్ తొలి వికెట్ పడింది. ఆ తర్వాత.. సచిన్ దినేష్ కార్తీక్‌తో, ఆ తరువాత యూసుఫ్ పఠాన్‌తో కలిసి స్కోర్‌ను 300కి తీసుకెళ్లాడు.

Delhi: పుట్టినరోజు జరుపుకుంటున్న ఓ వ్యక్తిపై కత్తితో దాడి.. ఢిల్లీలో ఘటన

ఆ తర్వాత సచిన్‌తో కలిసి ధోనీ చివరి 55 బంతుల్లో 101 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. సచిన్ 50వ ఓవర్ మూడో బంతికి 1 పరుగు తీసి క్రికెట్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. టెండూల్కర్ 147 బంతులు ఎదుర్కొని 25 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. దీంతో 13 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌ ఆటగాడు సయీద్‌ అన్వర్‌ చేసిన 194 పరుగుల అత్యధిక వన్డే స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు. 200 పరుగులు చేసిన తర్వాత ధోనీతో కలిసి సచిన్ నాటౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో అంతర్జాతీయ పురుషుల వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

రెండేళ్లలోనే సెహ్వాగ్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు
200 పరుగుల అత్యధిక స్కోరు రికార్డు సచిన్ పేరిట ఒక సంవత్సరం, 9 నెలల 14 రోజులు మాత్రమే మిగిలిపోయింది. 2011 డిసెంబర్ 8 న సచిన్‌ను తన ఆరాధ్య దైవంగా భావించిన వీరేంద్ర సెహ్వాగ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో 209 పరుగుల ఇన్నింగ్స్ ఆడి సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. డబుల్ సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా సెహ్వాగ్ నిలిచాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ మరో ప్రత్యేకత ఉంది. రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా 153 పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించింది.