హైదరాబాద్ మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి ఎస్‌వైఆర్ గార్డెన్‌లో యాంటీ డ్రగ్ అవేర్ నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు రాత్రి వేళ ఇళ్ళల్లో హాయిగా నిద్ర పోతున్నారంటే దానికి పోలిసులే కారణమని, పోలీసులు శాంతి భద్రతలు కాపాడంతో పాటు, సామాజిక కార్యక్రమాల్లోనూ తమ వంతు పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. మాదక ద్రవ్యాలు క్రమంగా విద్యా సంస్థల్లోకి చాప కింద నీరులా విస్తరిస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, అమ్మాయిలను వేధించేందుకు ఆకతాయిలు ఎన్నో రకాలుగా వ్యవహరిస్తుంటారని, బాధిత అమ్మాయిలు షీ టీమ్ లకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలుంటాయని ఆమె వెల్లడించారు. ఇదివరకు కళాశాలల్లో రాగింగ్ కు ఉండేవని, కమిటీలు వేసి రాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు.
Also Read : YS Jagan Mohan Reddy: కోలుకుంటున్న ఆ చిన్నారి.. ఆశీర్వదించిన సీఎం జగన్
ప్రస్తుతం మాదక ద్రవ్యాల నిరోధానికి పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని ఆమె వివరించారు. అనంతరం.. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం అత్యంత ప్రమాదకరమన్నారు. మొదట్లో ఆనందం ఇచ్చినా క్రమంగా ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింటుందని, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా పూర్తిగా దెబ్బతింటాయన్నారు. చరవాణినీ సైతం పరిధుల మేరకు వినియోగించాలని, యువత హద్దులు దాటి సెల్ ఫోన్ వినియోగిస్తే సమస్యల పాలవుతారన్నారు. ఇటీవల ఓ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినిలు గుర్తు తెలియని వ్యక్తులతో స్నేహం చేసి, సైబర్ మోసానికి గురయ్యారని ఆయన వెల్లడించారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరూ కూడా సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తులు స్నేహం చేయొద్దని, మాదక ద్రవ్యాలు, సైబర్ మోసాలపైన రాచకొండ కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
