Separate Gate for Childrens at Sabarimala: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. శబరిమలలో భారీ రద్దీ కారణంగా కొందరు భక్తులు అయ్యప్పను నేరుగా దర్శించుకోకుండానే.. వెనుదిరుగుతున్నారు. చాలా మంది దూరం నుంచి అయ్యప్ప కొండకు మొక్కి తిరుగుపయనం అవుతున్నారు. ఈ క్రమంలోనే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే చిన్నారులు సులభంగా మణికంఠుడి సన్నిధికి చేరుకునేందుకు వీలుగా టీబీడీ ప్రత్యేక గేటు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇరుముడులు కట్టుకున్న అయ్యప్ప భక్తులు, జనంతో లైన్లు కిక్కిరిసిపోతుండటంతో.. చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఒక బాలిక స్పృహ తప్పి పడిపోగా.. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనను నేపథ్యంలో చిన్నారులకు ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీబీడీ నిర్ణయించింది. ఆదివారం ఉదయం నుంచి చిన్నారులకు ముందు వరుసలో అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు. దీంతో చిన్నారులకు పొడవైన క్యూలైన్ల బాధ తప్పింది. టీబీడీ నిర్ణయంతో చిన్నారులు అయ్యప్పస్వామి వారిని దర్శించుకోవడమే కాకుండా.. వారి తల్లిదండ్రులకు కూడా ఉపశమనం కలుగుతుందని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: KL Rahul: కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్!
మరోవైపు శబరిమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా త్వరలో వైఫై సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. శబరిమలలో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో దర్శన సమయాన్ని మరో గంట సేపు పొడగిస్తున్నట్లు గత వారంలో టీబీడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదివరకు రెండో విడతలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్పస్వామి భక్తులకు దర్శనం ఇస్తుండగా.. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభిస్తోంది. దర్శనం కోసం క్యూలో వేచి ఉండే భక్తులకు మంచి నీరు, బిస్కెట్లను టీబీడీ అందిస్తోంది.