NTV Telugu Site icon

Varun Chakaravarthy: అశ్విన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌ చేసిన వరుణ్ చక్రవర్తి!

Varun Chakaravarthy

Varun Chakaravarthy

టీమిండియా ఆఫ్ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టీ20లో రెండు వికెట్స్ తీయడంతో వ‌రుణ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ సిరీస్‌లో ఈ మిస్టరీ స్పిన్న‌ర్ ఇప్పటివరకు 10 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.

ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. 2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో యాష్ 9 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డును వ‌రుణ్ బ్రేక్ చేశాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లోని మొదటి టీ20లో మూడు వికెట్స్ తీసిన వ‌రుణ్.. రెండో టీ20లో ఐదు వికెట్స్ పడగొట్టాడు. ఇక మూడో టీ20లో రెండు వికెట్స్ తీయడంతో 10 వికెట్స్ వ‌రుణ్ ఖాతాలో చేరాయి. ఇక చివరి టీ20 నవంబర్ 15న జరగనుంది.

Also Read: Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. బద్దలైన రైనా రికార్డు !

మూడో టీ20లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి తన కోటా 4 ఓవర్లలో రెండు వికెట్స్ తీసి.. 54 రన్స్ ఇచ్చాడు. ఓపెన‌ర్ రీజా హెండ్రిక్స్‌ (21), కెప్టెన్ ఐడైన్ మార్‌క్ర‌మ్‌ (29)ల‌ను సరైన స‌మ‌యంలో పెవిలియ‌న్‌కు పంపి మ్యాచ్‌ను భార‌త్ వైపు తిప్పాడు. గ‌త రెండు మ్యాచ్‌ల‌తో పోలిస్తే.. వ‌రుణ్ ప‌రుగులు కాస్త ఎక్కువ‌గా ఇచ్చిన‌ప్ప‌టికీ రెండు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టి భార‌త్‌కు మ‌రో విజ‌యాన్ని అందించాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 12 టీ20లు ఆడిన వ‌రుణ్.. 17 వికెట్స్ పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5/17. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఐపీఎల్ ద్వారా భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో 71 మ్యాచులు ఆడిన వ‌రుణ్.. 83 వికెట్స్ తీశాడు.