NTV Telugu Site icon

SA vs IND: వరుణ్‌ మాయ చేసినా.. రెండో టీ20లో భారత్‌కు తప్పని ఓటమి!

Ind 2nd T20i

Ind 2nd T20i

మొదటి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న భారత్‌కు రెండో టీ20లో ఓటమి తప్పలేదు. గెబేహా వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 125 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (5/17) మాయతో భారత్‌ను గెలుపు దిశగా నడిపించినా.. ట్రిస్టియన్‌ స్టబ్స్‌ (47 నాటౌట్‌; 41 బంతుల్లో 7×4), కొయెట్జీ (19; నాటౌట్‌; 9 బంతుల్లో 2×4, 1×6) పోరాడడంతో మ్యాచ్‌ దక్షిణాఫ్రికా సొంతమైంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులే చేసింది. సెంచరీ హీరో సంజూ శాంసన్‌ డకౌట్ కాగా.. అభిషేక్‌ శర్మ (4) మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ (4) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో 4 ఓవర్లకు భారత్ స్కోర్ 15/3. ఈ దశలో తిలక్‌ వర్మ (20; 20 బంతుల్లో 1×4, 1×6), అక్షర్‌ పటేల్‌ (27; 21 బంతుల్లో 4×4) జట్టును ఆదుకున్నారు. అయితే తిలక్‌, అక్షర్‌ కొద్ది వ్యవధిలో అవుట్ అయ్యారు. హార్దిక్‌ పాండ్యా (39 నాటౌట్‌; 45 బంతుల్లో 4×4, 1×6) విలువైన ఇన్నింగ్స్‌ ఆడడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేసింది.

125 పరుగుల లక్ష్యంను దక్షిణాఫ్రికా అలవోకగా ఛేదించేస్తుందనుకుంటే.. వరుణ్‌ చక్రవర్తి దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో పయనించింది. రికిల్‌టన్‌ (13)ను ఔట్‌ చేసి అర్ష్‌దీప్‌ జట్టుకు సింగ్ శుభారంభం ఇవ్వగా.. ఆ తర్వాత అద్భుత స్పెల్‌తో వరుణ్‌ సఫారీలను వణికించాడు. మార్‌క్రమ్‌ (3), హెండ్రిక్స్‌ (24), యాన్సెన్‌ (7), క్లాసెన్‌ (2), మిల్లర్‌ (0)లను అవుట్ చేశాడు. దాంతో 16 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ 88/7కు చేరుకుంది. చివరి 4 ఓవర్లలో 37 పరుగులు చేయడం కష్టమే అనిపించింది. కానీ అర్ష్‌దీప్‌ వేసిన 17వ ఓవర్లో కొయెట్జీ 6, 4 కొట్టడంతో మ్యాచ్‌ భారత్ నుంచి చేజారిపోయింది. 18వ ఓవర్లో అవేష్‌ రెండు ఫోర్లు, 19వ ఓవర్లో అర్ష్‌దీప్‌ నాలుగు ఫోర్లు ఇవ్వడంతో మ్యాచ్ పోయింది. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. మూడో టీ20 బుధవారం జరగనుంది.