రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు రుణమాఫీ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (ఉమ్మడిగా “బ్యాంకులు” అని పిలువబడుతాయి) వాటి బ్రాంచ్ ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకు 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంటరుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద ప్రతి రైతుకుటుంబం, 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 09-12-2023 తేదీ నాటికి బకాయి వున్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి వుంటుంది.
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పటిష్టపరచడానికి, వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమాన్ని మెరుగుపర్చడానికి, పంటరుణాల మాఫీని ఒక అత్యవసర పెట్టుబడిగా గుర్తించింది. పంట రుణమాఫీ రైతులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించి, వారు బ్యాంకుల నుండి తక్కువ వడ్డీపై కొత్త రుణాలు తీసుకోవడానికి మరియు అధిక వడ్డీపై బయట రుణాలు తీసుకోకుండా ఉపయోగపడుతుంది. తద్వారా, అత్యవసర వ్యవసాయ ఇన్ పుట్ లు కొనుక్కోవడానికి అవకాశం కలుగచేస్తుంది. అధిక వడ్డీ రేట్ల ద్వారా తీవ్రతరం అయ్యే శాశ్వత రుణగ్రస్థత నుండి వారిని కాపాడుతుంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థికస్థితిని దృష్టిలో వుంచుకొని వ్యవసాయ కార్యకలాపాలు స్థిరంగా ఉండేలా చూడటానికి, రాష్ట్రంలో రైతుల కోసం పంట రుణమాఫీ-2024 పధకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ప్రభుత్వం పంట రుణమాఫీ పథకం 2024 అమలు కోసం ఈ క్రింది మార్గదర్శకాలను నిర్ణయించింది.
రైతు రుణమాఫీ గైడ్‌లైన్స్
- భూ వ్యవసాయ భూమి కూడా కలిగి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది.
- 12-12-2018 తర్వాత నుంచి రుణాలు తీసుకున్న రైతులకు రెండు లక్షల రుణమాఫీ.
- రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరి.
- 2 లక్షలకు పైబడి ఉన్న రుణాలకు బ్యాంకులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
- 09-12-2023 తర్వాత రెన్యువల్ చేసిన రుణాలకు పథకం వర్తించదు.
- పీఎం కిసాన్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది.
- మహిళల పేరు మీద ఉన్న రుణాలకు ప్రయారిటీ.
- మొదటగా మహిళల పేరు మీద ఉన్న రుణాలను మాఫీ.
- పథకం అమలుకు ఐటి భాగస్వామిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్.
- రుణమాఫీ అమలకు ప్రతి బ్యాంకుకు ఒక నోడల్ అధికారి.
- ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్లు, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్లు నుంచి పథకం వర్తింపు.
- ఈ పథకం క్రింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినట్లయితే లేదా మోసపూరితంగా పంటరుణాన్ని పొందినట్లు లేదా పంట రుణమాఫీకి అర్హులుకారని కనుగొన్నట్లయితే, పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్టప్రకారం వ్యవసాయశాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుంది.