NTV Telugu Site icon

Russia: రష్యా విమానం ప్రమాదం.. 10 మృతదేహాలు, ఫ్లైట్‌ రికార్డర్‌లు వెలికితీత

Wagner Crash

Wagner Crash

Russia: రష్యా రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ మరణం ఆశ్చర్యం కలిగించదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు చేసిన క్షణమే, అతడికి మూడిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఇప్పుడు విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించడంతో, “ఎప్పుడో జరగాల్సింది… కాస్త ఆలస్యమైందంతే” అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, వాగ్నర్ గ్రూపు అధినేతగా, పుతిన్ అంతరంగికుడిగా రష్యా ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మృత్యువాత పడడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆ విమానం ఎందుకు కూలిపోయిందన్నది ఇప్పటివరకు తెలియరాలేదు.

Read Also: Amit Shah: కొత్త క్రిమినల్ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి

రెండు రోజుల క్రితం వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్‌ను చంపినట్లు భావిస్తున్న విమాన ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఫ్లైట్ రికార్డర్‌లు, పది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా పరిశోధకులు శుక్రవారం తెలిపారు. మాస్కో సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా వాగ్నర్ స్వల్పకాలిక తిరుగుబాటు చేసిన సరిగ్గా రెండు నెలల తర్వాత బుధవారం జరిగిన క్రాష్‌కు కారణమేమిటనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. “ప్రాథమిక పరిశోధనా ప్రకారం, విమానం కూలిపోయిన ప్రదేశంలో 10 మంది బాధితుల మృతదేహాలు కనుగొనబడ్డాయి” అని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ సోషల్ మీడియాలో తెలిపింది. వారెవరో గుర్తుపట్టడానికి జన్యు విశ్లేషణలు జరుగుతున్నాయి. సంఘటనా స్థలం నుంచి ఫ్లైట్ రికార్డర్లను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ పేర్కొంది.

ప్రిగోజిన్ సన్నిహిత పరివారంలోని కొంతమంది ప్రాణాలను కూడా బలిగొన్న ప్రమాదం నేపథ్యంలో అనేక పాశ్చాత్య దేశాలు, క్రెమ్లిన్ విమర్శకులు వాగ్నర్ చీఫ్ హత్య చేయబడి ఉండవచ్చని ఊహించారు. క్రెమ్లిన్ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ సంఘటనను విషాదకరమని పేర్కొంది. ఆ ఆరోపణలను పూర్తి అబద్ధమని కొట్టిపారేసింది. ఎయిర్ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై దర్యాప్తు ప్రారంభించామని, అయితే ఈ ఘటనకు కారణమేమిటనే దానిపై తాము మౌనంగా ఉన్నామని రష్యా అధికారులు తెలిపారు.

Show comments