కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు వరుస తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగులో మంచి స్థానం సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పలు సినిమాల్లో నటిస్తుండగా, తాజాగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీ కార్తీక్ నెక్స్ట్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ సినిమాలో ఆమె తారా అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు. దేవ్ రామ్ నాథ్, వినాయక్ వైద్యనాథన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను సిరుని సినీ కార్పొరేషన్, మాడ్ బాయ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను కూడా ప్రకటించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు. ఇందులో రుక్మిణి వసంత్‌ను ‘తారా’గా పరిచయం చేశారు. ఈ వీడియోతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. దర్శకుడు శ్రీ కార్తిక్, నటులు దేవ్ రామనాథ్, వినాయక్ వైద్యనాథన్ కలిసి ‘తారా’ పాత్రను ఖరారు చేయడానికి సమయం మించిపోతోందని చర్చించుకుంటుండగా, వారికి ఓ నోటిఫికేషన్ వస్తుంది. అది వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా ఆసక్తికరమైన సరదా సన్నివేశాలతో సాగిన వీడియో చివర్లో రుక్మిణి వసంత్‌ను పరిచయం చేశారు.

