Supreme Court on Information Commission Vacancies: కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్ర సమాచార కమిషన్ (ఎస్‌ఐసీ)ల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని, లేకుంటే సమాచార హక్కు చట్టం, 2005 ‘మృతపత్రం’గా మారుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సమాచార కమిషన్లు పనిచేయకుండా పోయాయని దాఖలైన పిటిషన్‌ను పరిశీలించింది. సమాచార కమిషన్లలో ఖాళీలు, అక్కడ పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యతో సహా పలు అంశాలపై సమాచారాన్ని సేకరించాలని సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖను ఆదేశించింది.
Also Read: Priyanka Gandhi: సబ్సిడీ సిలిండర్లు, రుణమాఫీ, ఉచిత కరెంట్.. ఛత్తీస్‌గఢ్‌లో ప్రియాంక హామీ
జార్ఖండ్, త్రిపుర, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని ఎస్‌ఐసీలు పనికిరాకుండా పోయాయన్న పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత 2005 సమాచార హక్కు చట్టం డెడ్ లెటర్‌గా మారుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సీఐసీ, ఎస్‌ఐసీల్లోని ఖాళీలను సకాలంలో భర్తీ చేయడంతో సహా సమస్యలపై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం, రాష్ట్రాలు పాటించడం లేదని భరద్వాజ్ ఆరోపించారు. దీనిని విచారణ స్వీకరించిన సుప్రీంకోర్టు.. పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకోసం మూడు వారాల గడువు ఇచ్చింది. అనంతరం దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఖాళీలను భర్తీ చేయకుంటే సమాచార హక్కు చట్టం ‘మృతపత్రం’గా మారిపోతుందని ఈ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు.