RTC Driver: ‘ఆర్టీసీ బస్సులోనే సురక్షిత ప్రయాణం’ అని నమ్మి ప్రయాణిస్తున్నారు జనాలు.. బస్సులో పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ చేతిలో ఉంటాయి. కాస్త అటు ఇటు అయినా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. జీవితాలు తారుమారవుతాయి. అయినా పట్టించుకోకుండా కొందరు ఆర్టీసీ ఉద్యోగులు సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. వారి వల్ల సంస్థకు చెడ్డ పేరొస్తుంది. తాజాగా ఓ డ్రైవర్ చేసిన పనికి ప్రయాణికులు నానావస్థలు పడాల్సి వస్తోంది. విజయవాడ బస్టాండ్ నుంచి నూజివీడు డిపోకు చెందిన నాన్ స్టాప్ బస్సు 40మంది ప్రయాణికులతో బయల్దేరింది. అప్పటి వరకు ప్రయాణికులకు టికెట్స్ ఇచ్చిన డ్రైవర్.. మార్గమధ్యంలో బస్సును రోడ్డుపై నిలిపివేసి ఔట్ సోర్సింగ్ డ్రైవర్ రమేష్ పారిపోయాడు. ఏం జరిగిందని ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడింది.
Read Also: Gold Price: దీపావళి ఆఫర్.. కుప్పకూలిన బంగారం ధర
రమేష్ అనే వ్యక్తి ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు బస్సు నడిపిస్తున్న క్రమంలో పరిస్థితిని గమనించిన ప్రయాణికులు.. మద్యం తాగి వాహనం నడుపుతున్నావని నిలదీశారు. వెంటనే డ్రైవర్ విజయవాడ ప్రభాస్ కాలేజీ సమీపంలో బస్సు దిగి పారిపోయాడు. అతడి దగ్గర టిక్కెట్లు ఇచ్చే టిమ్ మిషన్‌తో పాటు ప్రయాణికుల నుంచి వసూలు చేసిన డబ్బులు ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వెంటనే స్పందించి మరో బస్సులో ప్రయాణికులను అక్కడి నుంచి పంపించేశారు.
Read Also: Hyderabad Night Traffic: నిబంధనలు పగలేనా ?.. నైట్ ట్రాఫిక్ రూల్స్ కు రెస్టేనా..?
నూజివీడు ఆర్టీసీ డిపో మేనేజర్ వివరణ ఇస్తూ.. ఈ బస్సు విజయవాడ బస్టాండ్ నుంచి నూజివీడు వెళ్తోంది. డ్రైవర్ మద్యం తాగి ఉండొచ్చని భావిస్తున్నామని అన్నారు. అతడ్ని విధుల నుంచి తొలగించామని.. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా మరో బస్సు ఏర్పాటు చేసి గమ్య స్థానానికి చేర్చామని తెలిపారు. అతడి వద్ద ఉన్న రూ.2,650, టిక్కెట్ మిషన్‌ను డ్రైవర్ బంధువులు డిపోలో అప్పగించారని చెబుతున్నారు.