Rowdy Sheeter Srikanth Parole: జైల్లో ఉన్న రౌడీషీటర్ ప్రియుడు శ్రీకాంత్ కోసం అరుణ తపన పడితే… ఆ అరుణ కళ్ళలో ఆనందం కోసం చాలామందే పనిచేశారట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి అధికారి నుంచి ఐపీఎస్‌ల మీదుగా… నెల్లూరు జిల్లాలోని ఓ విద్యాసంస్థ అధినేత దాకా… చాలామందే శ్రీకాంత్‌కు పెరోల్ ఇప్పించడానికి పని చేశారట. ఆమెతో ఒక్కొక్కరిది ఒక్కో రకం అనుబంధం. ఒక్కో రకం అవసరం. అంతా కలిసి సాగిలపడ్డారు. రౌడీషీటర్‌కు పెరోల్ ఇప్పించడం కోసం అడ్డదారులు తొక్కారన్న వాస్తవాలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో కలకలం రేపుతున్నాయి. ఈ వివాదంలో రోజుకో పేరు బయటికి వస్తూ… వింటున్న వాళ్ళంతా అమ్మనీ… ఇంతుందా..? అంటూ నోళ్ళు వెళ్ళబెడుతున్నారట. ఇంకొందరైతే…ఈ అరుణ కిరణాలు బాగానే విస్తరించాయి…. గట్టిగానే పని చేశాయంటూ సెటైర్స్ వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తన ప్రియుడికి పెరోల్ కోసం అరుణ సెక్రటేరియెట్ స్థాయిలో చక్రం తిప్పారని, అత్యున్నత అధికారి ఐపీఎస్‌ను తన ఛాంబర్‌కు పిలిపించుకుని మరీ… పెరోల్‌కు రికమండ్ చేశారన్న వార్తలు ప్రభుత్వాన్ని షేక్ చేస్తున్నాయట. సదరు అత్యున్నత అధికారితో పాటు ఇంకో ఇద్దరు ఐపీఎస్‌ల పాత్ర ఇందులో ఉందన్న ప్రచారం జరుగుతుండగానే.. తాజాగా మరోపేరు బయటికి వచ్చింది. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన ఓ విద్యాసంస్థల ఛైర్మన్ ఇందులో కీలకంగా వ్యవహరించారన్న చర్చ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది.
Read Also: Storyboard: ఓట్ల చోరీ ఆరోపణలు పనిచేస్తాయా..? బీజేపీ సత్తా చాటుతుందా..?
సదరు విద్యాసంస్థల ఛైర్మన్ అరుణకు చాలా సన్నిహితంగా ఉంటారట. దీంతో ఆమె కళ్ళలో ఆనందం కోసం ఆయన తన కులం కార్డ్‌ను గట్టిగానే వాడారన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫారసు లేఖలు రిజెక్ట్ అయ్యాక కూడా… శ్రీకాంత్ పెరోల్ ఫైలు ఆగమేఘాల మీద కదిలింది. ఎమ్మెల్యేల సిఫారసు లేఖ వల్లే పెరోల్ వచ్చిందంటూ మొదట్లో గట్టిగా ప్రచారం జరిగింది. కానీ… ఆ తర్వాతే అసలు ట్విస్ట్ వెలుగు చూసింది. గూడూరులో కాలేజీ నడుపుతున్న విద్యాసంస్థల చైర్మన్‌కు, సచివాలయంలోని ఓ అతిపెద్ద అధికారికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గమని కూడా చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న అరుణ…, సదరు కాలేజీ ఛైర్మన్ ద్వారా పావులు కదిపి సెక్రటేరియెట్‌కు రాచబాట వేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు సార్లు అరుణ, సదరు కాలేజీ ఛైర్మన్ కలిసి సెక్రటేరియెట్‌కు వెళ్ళి ఆ పెద్ద సార్‌ని కలిశారట. దీంతో… ఆ పెద్ద సార్ హోంశాఖ కార్యదర్శిని తన ఛాంబర్‌కు పిలిపించారని, తర్వాత కూడా ఫోన్‌చేసి ఒత్తిడి తెచ్చినట్టు పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ పెద్ద సార్ ఆదేశాల మేరకే శ్రీకాంత్ పెరోల్‌పై సంతకాలైనట్టు అధికార వర్గాల్లో గట్టిగానే చెప్పుకుంటున్నారు. అదే నిజమని నిఘా విభాగం సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.
Read Also: Landslide In Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో విషాదం: కొండచరియలు విరిగిపడి 31 మంది మృతి..!
శ్రీకాంత్‌కి పెరోల్ ఇవ్వడానికి సదరు విద్యా సంస్థల చైర్మన్… ముందు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దగ్గరికి వెళ్ళారు. అందుకు తాను ఒప్పుకోలేదని స్వయంగా సోమిరెడ్డే మీడియా ముందు చెప్పారు. ఆ తర్వాత కోటంరెడ్డి, సునీల్ లెటర్స్ అంశం తెర మీదికి వచ్చింది. అవి కూడా రిజెక్ట్ అవడంతో… ఇక ఈ ఎమ్మెల్యేలతో లాభం లేదనుకుని… డైరెక్ట్‌గా సచివాలయంలోని పెద్ద సార్‌కే గాలం వేసినట్లు తెలుస్తోంది. ఫలానా అరుణ వచ్చి కలుస్తుంది…. పని చేసిపెట్టమని కాలేజీ ఛైర్మన్ సెక్రటేరియెట్‌లోని హయ్యర్ ఆఫీసర్‌కు చెప్పడం, ఒకటి రెండు సార్లు వెంట తీసుకువెళ్ళడం, ఆ హయ్యర్ ఆఫీసర్ హోంశాఖ ఉన్నతాధికారికి ఫోన్ చేసి, శ్రీకాంత్‌కు పెరోల్ కోసం సిఫారసు చేయడం… ఇలా అన్నీ.. మూడో కంటికి తెలియకుండా చకచకా జరిగిపోయాయట. సదరు విద్యాసంస్థల చైర్మన్‌కు గత ప్రభుత్వంలోని మంత్రులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పుకుంటున్నారు. ఆ సంబంధాలతోనే… ఓ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసేందుకు కూడా ప్రయత్నించారట ఆయన. కానీ చివరి నిమిషంలో వర్కౌట్ కాలేదని తెలిసింది. ఇప్పుడు అరుణకు, విద్యాసంస్థల చైర్మన్ కి మధ్య ఉన్న సంబంధాలు ఏంటన్న చర్చ జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్‌గా నడుస్తోంది. ఆమె అడిగిన వెంటనే… పెరోల్ ఇప్పించడానికి ఆ కాలేజీ యజమాని సహకరించడం వెనుక ఏదైనా లబ్ది ఉందా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు ఎక్కువ మంది. సదరు కాలేజీ ఛైర్మన్‌కి గూడూరులో రౌడీ షీటర్స్ బెడద ఎక్కువగా ఉందట.
అందుకే శ్రీకాంత్ ను బయటికి తీసుకొచ్చి.. తన మనిషిగా ప్రొజెక్ట్ చేసుకుంటే… విద్యాసంస్థల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రావని అనుకున్నారన్నది ఒక వెర్షన్. ఆయన ఆస్తులన్నీ వివాదాల్లో ఉండటం, లోకల్‌గా కాలేజీ నిర్వహణలో కూడా సమస్యలు వస్తుండటంతో… ఆయన ఈ మార్గం ఎంచుకుని ఉంటారన్నది కొందరి అనుమానం. ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అరుణ వ్యవహారం సదరు కాలేజీ ఛైర్మన్ ఇంట్లో తెలియడంతో…. ఆయన పవర్స్ కట్‌చేసి కూర్చోబెట్టారట. కాలేజీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కుటుంబ సభ్యులు చెప్పేసినట్టు సమాచారం. అయితే… ఈ పెరోల్ ఇప్పించిన నెట్‌వర్క్‌ని చూస్తే… ఇదేదో చిన్న వ్యవహారంలా అనిపించడం లేదన్నది మరో వెర్షన్. కేవలం కాలేజీ ఛైర్మన్‌కు సెక్యూరిటీగా ఉండటం కోసం అంత ఖర్చుపెట్టి, ఆ స్థాయిలో పైరవీలు చేసి బయటికి ఎందుకు రప్పిస్తారు? అంతకు మించిన వ్యవహారాలు ఏవో ఉన్నాయన్నది ఎక్కువ మంది డౌట్.
