India Enters Asia Cup 2023 Super-4: ఆసియా కప్ 2023 రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (74 నాటౌట్; 59 బంతుల్లో 6×4, 5×6), శుభ్‌మన్ గిల్ (67 నాటౌట్; 62 బంతుల్లో 8×4, 1×6) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ విజయంతో భారత్ గ్రూప్-ఏ నుంచి సూపర్-4 రెండో బెర్తును సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన నేపాల్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్ మొదటి బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక నేడు శ్రీలంక-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌ను బట్టి గ్రూప్-బీలో సూపర్-4 బెర్తులు ఖరారు అవుతాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌కు భారత ఫీల్డింగ్ వరంగా మారింది. 5 ఓవర్ల వ్యవధిలో నాలుగు క్యాచ్‌లు నేలపాలు కావడంతో.. ఓపెనర్లు ఆసిఫ్ షేక్ (58; 97 బంతుల్లో 8×4), కుశాల్ బుర్టేల్ (38; 25 బంతుల్లో 3×4, 2×6)లకు రెండేసి లైఫ్స్ లభించాయి. ఈ అవకాశాల్ని ఇద్దరూ బాగానే ఉపయోగించుకున్నారు. బుర్టేల్ భారత బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ పరుగులు రాబడితే.. షేక్ ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. పదో ఓవర్లో బుర్టేల్‌కు శార్దూల్ చెక్ పెట్టగా.. జడేజా మాయాజాలంతో షర్కి (7), రోహిత్ పౌడెల్ (5), కుశాల్ మల్లా (2)లు స్వల్ప వ్యవధిలో ఔట్ అయ్యారు. ఈ సమయంలో సోంపాల్ కామి (48; 56 బంతుల్లో 1×4, 2×6), దీపేంద్ర సింగ్ ఐరీ (29) రాణించారు. జడేజా (3/40), సిరాజ్ (3/61) ప్రత్యర్థిని దెబ్బ తీశారు.
Also Read: Gold Price Today: మగువలకు షాకింగ్ న్యూస్.. నేడు తులం బంగారంపై ఎంత పెరిగిందో తెలుసా?
లక్షఛేదనలో భారత్ 2.1 ఓవర్లలో 17/0తో ఉన్న దశలో వర్షం మొదలైంది. దాంతో రెండు గంటలకు పైగా ఆట ఆగిపోయింది. ఆట మళ్లీ మొదలు కాదేమో అనుకున్న దశలో వరుణుడు కరుణించాడు. దీంతో అంపైర్లు భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. ఓపెనర్లు రోహిత్, గిల్ బౌండరీలు బాదుతూ పరుగులు చేసారు. దాంతో భారత్ 20.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 147 పరుగులు చేసింది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ మళ్లీ తలపడబోతున్నాయి. రెండు జట్లూ గ్రూప్-ఏ నుంచి సూపర్-4కు అర్హత సాధించడంతో.. తర్వాతి దశలో మళ్లీ ఓ మ్యాచ్ ఆడనున్నాయి.