Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ ‘రోహిత్ శర్మ’ మరో అరుదైన ఘనతను సాధించబోతున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు బరిలోకి దిగనున్న రోహిత్.. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించనున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా గాయపడిన రోహిత్ శర్మ కొంతకాలం ఆటకు దూరమయ్యాడు. అనంతరం జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే ఆడాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న రోహిత్, అఫ్గానిస్థాన్‌తో జరిగే వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దమయ్యాడు.
ధర్మశాలలో జరిగే తొలి వన్డేలో రోహిత్ శర్మ మైదానంలో అడుగుపెట్టే సమయానికి అతని వయసు 39 సంవత్సరాలు 44 రోజులు. దీంతో భారత్ తరఫున అత్యంత ఎక్కువ వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కనున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు మాజీ భారత క్రికెటర్ మొహిందర్ అమర్‌నాథ్ పేరిట ఉంది. ఆయన 39 సంవత్సరాలు 36 రోజుల వయసులో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో మొహిందర్ అమర్‌నాథ్ కీలక సభ్యుడు.
మరో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన చివరి వన్డే మ్యాచ్‌ను 38 ఏళ్ల వయసులో ఆడాడు. 2012 మార్చిలో ఆయన చివరి వన్డే ఆడగా.. 2013లో 40 ఏళ్లు దాటిన తర్వాత తన చివరి టెస్టు మ్యాచ్‌కు వీడ్కోలు పలికాడు. రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగితే.. 40 ఏళ్ల వయసులో వన్డే ఆడిన తొలి భారత క్రికెటర్‌గా కూడా నిలిచే అవకాశం ఉంది. అయితే ఆయన 2027 ప్రపంచకప్ వరకు కొనసాగుతారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు.
రోహిత్ శర్మ 2007లో భారత జట్టుకు వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కెరియర్ ప్రారంభంలో జట్టులో స్థానం నిలబెట్టుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే 2013లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అతనికి ఓపెనింగ్ బాధ్యతలు అప్పగించాడు. అదే రోహిత్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఓపెనర్‌గా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రోహిత్.. శిఖర్ ధావన్‌తో కలిసి భారత జట్టుకు మంచి ఓపెనింగ్ జోడీగా మారాడు. ఓపెనర్‌గా ఇప్పటివరకు 282 వన్డే మ్యాచ్‌ల్లో 11,577 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 33 సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు.. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా కూడా రోహిత్ శర్మ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఇవే కాదు.. కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ అనేక విజయాలు సాధించాడు. అతని నాయకత్వంలో భారత్ 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోగా.. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు కూడా చేరుకుంది. ఇప్పుడు అఫ్గానిస్థాన్ సిరీస్‌తో మరో చారిత్రక రికార్డును తన పేరున లిఖించుకునేందుకు హిట్‌మ్యాన్ సిద్ధమయ్యాడు.

