Rohit Sharma react on Virat Kohli Golden Duck in IND vs AFG 3rd T20: స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ టీ20 పునరాగమనం చేశారు. 3వ టీ20లో రోహిత్ సెంచరీతో సత్తాచాటాడు. అయితే వ్యక్తిగత కారణాలతో మొదటి టీ20 ఆడని కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. మూడో మ్యాచ్‌లో మాత్రం గోల్డెన్ డకౌట్ అయ్యాడు. చివరి మ్యాచ్‌లో కోహ్లీ పరుగులు చేయకపోయినప్పటికీ.. అతని ఉద్దేశం ఏంటో అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ చెప్పాడు. విరాట్ పరుగులు చేయాలనే కసితోనే బరిలోకి దిగుతాడని, అతడికి డక్ అనే పదం అస్సలు ఇష్టం ఉండదన్నాడు.
జియో సినిమా చాట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘మేము ఆటగాళ్లకు వారి స్థానం, క్రికెట్ ఎలా ఆడాలనుకుంటున్నామనే దానిపై క్లారిటీ ఇచ్చాం. యువకులు మైదానంలోకి వచ్చినపుడు జట్టుకు ఏం చేయాలో తెలుసు. మూడో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. పరుగులు చేయాలనే కసితోనే విరాట్ ఎప్పుడూ బరిలోకి దిగాడు. అతడికి డక్ అనే పదం అస్సలు నచ్చదు. డకౌట్ ఔటైనప్పటికీ అతడి ఆలోచన మాత్రం మారదు. సంజూ శాంసన్ ఇలానే వికెట్ కోల్పోయాడు. దూకుడుగా ఆడాలనే ఉద్దేశం సంజూలోనూ ఉంటుంది’ అని అన్నాడు.
Also Read: IND vs ENG: ఉప్పల్ టెస్ట్‌కు చీఫ్ గెస్ట్‌గా తెలంగాణ సీఎం.. హాజరుకానున్న భారత క్రికెట్ దిగ్గజాలు!
‘వన్డే ప్రపంచకప్ 2023 గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. అయితే వన్డే ప్రపంచకప్ గెలవడం ఎప్పటికీ నాకు ప్రత్యేకమే. అలాగని టీ20 ప్రపంచకప్, టెస్టు ఛాంపియన్‌షిప్ కీలకమైనవి కావని నా ఉద్దేశం కాదు. వన్డే ప్రపంచకప్‌ను చూస్తూ పెరిగా కాబట్టి నాకు అది ప్రత్యేకం. అద్భుత ఆటతో ఫైనల్‌కు చేరుకున్నాం. ఫైనల్‌లో తీవ్రంగా శ్రమించినా ఫలితం మాత్రం దక్కలేదు. అందరం నిరుత్సాహానికి గురయ్యాం. ఆ సమయంలో అభిమానులూ ఆగ్రహంతో ఉన్నారు. దానిని నేను అర్థం చేసుకోగలను. మా ముందు టీ20 ప్రపంచకప్ 2024 ఉంది. తప్పకుండా గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం’ అని రోహిత్ చెప్పుకోచ్చాడు.