Site icon NTV Telugu

Rohit Sharma: 100కు ఆలౌట్ అయినా పర్లేదనుకున్నాం: రోహిత్

Rohit Sharma

Rohit Sharma

కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించేందుకు తాము చాలా రిస్క్ తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ చెప్పాడు. బ్యాటర్లు రిస్క్‌ తీసుకుని దూకుడుగా ఆడే క్రమంలో 100 పరుగులకు ఆలౌటైన ఫర్వాలేదనే మైండ్‌సెట్‌తో ఉన్నామని తెలిపాడు. పిచ్‌ పెద్దగా సహకరించకున్నా.. టీమిండియా బౌలర్లు గొప్పగా రాణించారని ప్రశంసించాడు. రెండో టెస్టు విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. డ్రా అవుతుందనుకున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన భారత్.. సంచలన విజయం సాధించింది.

మ్యాచ్ అనంతరం భారత్ దూకుడుగా ఆడటం వెనకున్న వ్యూహాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. ‘మ్యాచ్‌లో ఎలా ముందుకెళ్లాలనే దాని గురించి చాలా ఆలోచించాం. గౌతమ్ గంభీర్, నేను కలిసి ఆడాం. అతడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆటను కోల్పోయాం. నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. వీలైనంత త్వరగా బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేసి.. మా బ్యాటింగ్‌పై దృష్టిసారించాలనుకున్నాం. ప్రత్యర్థి జట్టు ఎన్ని పరుగులు చేస్తుందనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. బంగ్లాను తక్కువ పరుగులకు కట్టడి చేసి.. వీలైనంత ఎక్కువ రన్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయాలని ప్లాన్‌ వేసుకున్నాం’ అని హిట్‌మ్యాన్ చెప్పాడు.

Also Read: Babar Azam: బాబర్‌ అజామ్‌ సంచలన నిర్ణయం!

‘పిచ్‌ పెద్దగా సహకరించకున్నా మా బౌలర్లు గొప్పగా రాణించారు. వీలైనంత త్వరగా పరుగులు చేయడానికి పెద్ద రిస్క్ తీసుకున్నాం. బ్యాటర్లు దూకుడుగా ఆడే క్రమంలో 100 లేదా 150 పరుగులకు ఆలౌటైనా ఫర్వాలేదనే మైండ్‌ సెట్‌తో ఆడాం. మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలన్నదే మా లక్ష్యం. ఆకాష్ దీప్ బాగా బౌలింగ్ చేశాడు. అతడు చాలా దేశవాళీ క్రికెట్ మ్యాచులు ఆడాడు. ప్రతి ఒక్కరు విజయంలో భాగమయ్యారు. ఈ విజయంతో అందరం సంతోషంగా ఉన్నాం’ అని రోహిత్ తెలిపాడు. మొదటి రోజు వర్షం కారణంగా 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. 2,3 రోజుల్లో ఒక్క బంతి కూడా పడలేదు. నాలుగో రోజు బంగ్లాదేశ్‌ 233 పరుగులకు ఆలౌట్ కాగా.. విధ్వంసక బ్యాటింగ్‌తో భారత్ కేవలం 34.4 ఓవర్లలోనే 285 పరుగులు చేసింది. చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 146 పరుగులకు కుప్పకూలగా.. 95 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఊదేసింది.

Exit mobile version