Rohit Sharma: ముంబై ఇండియన్స్‌లో మళ్లీ హిట్‌మ్యాన్ శకం మొదలుకానుంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత రోహిత్ శర్మకు ఫ్రాంచైజీ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై రోహిత్ తొలిసారి స్పందించాడు. ‘మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడటంపైనే మా దృష్టి అంతా ఉంటుంది’ అని ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్‌కు ముందు శుక్రవారం ముంబై ఫ్రాంచైజీ తమ ‘హిట్‌మ్యాన్’ను మళ్లీ సారథిగా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. 2023లో రోహిత్‌ను తప్పించి హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) కెప్టెన్సీ అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగిన హార్దిక్ కెప్టెన్సీ ప్రస్థానానికి ఈ నెల ప్రారంభంలో తెరపడింది. అర్ష్‌దీప్ సింగ్‌తో (Arshdeep Singh) జరిగిన స్వాప్ ట్రేడ్ (swap trade) ద్వారా హార్దిక్ ముంబైని వీడి పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టులోకి వెళ్లిపోవడంతో, యాజమాన్యం మళ్లీ రోహిత్ వైపే మొగ్గు చూపింది.
ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్లో రోహిత్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. “ముంబై ఇండియన్స్ నా జీవితంలో ఒక పెద్ద భాగం. ఈ జట్టును నడిపించడం నాకు ఎప్పుడూ గర్వకారణమే. రాబోయే సీజన్ గురించి నీతా భాభి (Nita Ambani), ఆకాష్‌తో (Akash Ambani) జరిగిన చర్చలు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. మనం ఏం సాధించగలమో నాకు పూర్తి నమ్మకం ఉంది” అని రోహిత్ పేర్కొన్నాడు. 20వ ఐపీఎల్ సీజన్లో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తమ అభిమాన ‘పల్టాన్’కు (Paltan) సంబరాలు చేసుకునే క్షణాలను అందిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అందరం కలిసికట్టుగా పోరాడుతూ, ఆటను ఆస్వాదిస్తూ తమదైన శైలిలో క్రికెట్ ఆడటమే లక్ష్యమని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉండగా.. ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మది ఒక అద్భుతమైన ప్రస్థానం. 2013 సీజన్లో జట్టు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు మధ్యలో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రోహిత్, అనూహ్యంగా ఆ జట్టును విజేతగా నిలిపాడు. ఆ తర్వాత పదేళ్ల కాలంలో 2015, 2017, 2019, 2020 సీజన్లలోనూ టైటిల్స్ గెలిచి, ఐపీఎల్ చరిత్రలో ఐదు ట్రోఫీలు అందుకున్న మొదటి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. 2011లో ముంబై జట్టులో చేరిన రోహిత్, ఇప్పటివరకు ఆ ఫ్రాంచైజీ తరఫున 220 మ్యాచ్‌లలో 5,698 పరుగులు చేసి జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగుల రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో 7,300కు పైగా పరుగులతో రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
కెప్టెన్‌గా రోహిత్ రికార్డులు కూడా ఎంతో గొప్పగా ఉన్నాయి. ఐపీఎల్లో 158 మ్యాచ్‌లకు సారథ్యం వహించి 87 విజయాలు అందించాడు. ఈ విషయంలో ఇటీవలే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ (MS Dhoni) మాత్రమే రోహిత్ కంటే ముందున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ విషయానికొస్తే, 2024లో వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను (T20 World Cup) భారత్ గెలిచినప్పుడే రోహిత్ చివరిసారిగా కెప్టెన్సీ చేశాడు. మొత్తంగా 220 టీ20 మ్యాచ్‌లలో 140 విజయాలతో 63.33 విన్నింగ్ పర్సంటేజ్ (win percentage) కలిగి ఉన్నాడు. కనీసం 200 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ఆరుగురు సారథులలో రోహిత్ విజయాల శాతమే అత్యుత్తమంగా ఉండటం గమనార్హం. ఇప్పుడు మళ్లీ తన పాత గూటికి కెప్టెన్‌గా తిరిగి రావడంతో ముంబై అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

