ప్రస్తుతం క్రికెట్ ఆడకున్నా.. టీమిండియా కెప్టెన్ ‘రోహిత్ శర్మ’ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. రిటైర్మెంట్ సంగతి అటుంచితే.. అత్యంత కఠినమైందిగా నిపుణులు పేర్కొన్న ‘బ్రాంకో’ ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అవుతాడా? అని మాజీలతో సహా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకున్న హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్ టెస్ట్ మీద అందరూ దృష్టిసారించడం ఇప్పుడు ఒకింత ఆశ్చర్యానికి గురిచేసేదే. అయితే అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ.. రోహిత్ బ్రాంకో టెస్టులో పాసయ్యాడు. ఇక తన టార్గెట్ 2027 ప్రపంచకప్ అని చెప్పకనే చెప్పాడు.
2024 టీ20 ప్రపంచకప్ అనంతరం పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. హిట్‌మ్యాన్ నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. హఠాత్తుగా టెస్టులకు రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించాడని అందరూ చర్చించారు. ప్రస్తుతం రోహిత్ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. టీ20, టెస్టులు వదిలేసినా వన్డేల్లో అయినా చాలా కాలం కొనసాగుతారనే అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇటీవలి రోజుల్లో భారత క్రికెట్లో పరిణామాలు చూస్తే హిట్‌మ్యాన్‌ను కొనసాగనిస్తారా అనే సందేహాలు కలిగాయి.
రోహిత్ శర్మను పక్కన పెట్టి శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌ను చేస్తారనే ప్రచారం నెట్టింట మొదలైంది. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్ భవితవ్యంపై అందరిలో సందేహాలు నెలకొన్నాయి. అదే సమయంలోనే అత్యంత కఠినమైన ‘బ్రాంకో’ ఫిట్‌నెస్ టెస్టును టీంఇండియాలో ప్రవేశపెట్టడం మరింత చర్చనీయాంశమైంది. హిట్‌మ్యాన్‌కు పొమ్మనకుండా పొగబెట్టడానికే ఈ టెస్ట్ తెచ్చారని మాజీ ప్లేయర్స్ ఆరోపించారు. అయితే రోహిత్ బ్రాంకో టెస్ట్ నెగ్గి తన ఫిట్‌నెస్‌పై ఉన్న సందేహాలకు తెరదించాడు. తాజాగా హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్ టెస్ట్ పాసవడం చూస్తుంటే.. వన్డేల్లో మరో రెండేళ్లు కొనసాగాలనే పట్టుదలతో ఉన్నాడన్నది స్పష్టం అవుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ టార్గెట్‌గా పెట్టుకున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే వన్డే ప్రపంచకప్ అతడి కల అన్న విషయం తెలిసిందే.
