మంగళవారం ముంబైలో జరిగిన 27వ ఎడిషన్ సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల వేడుకలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇందుకు కారణం.. ఎవరూ ఊహించని రీతిలో హిట్‌మ్యాన్ బరువు తగ్గడమే. వన్డే ప్రపంచకప్ 2027లో ఆడడంను లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్.. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో 95 కేజీల నుంచి 75 కిలోలకు బరువు తగ్గాడు. 20 కేజీల బరువు తగ్గిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు యువ క్రికెటర్లకే పోటీనిచ్చేలా ఉన్నాడు. ప్రస్తుతం రోహిత్‌కు 38 ఏళ్లు అంటే ఎవరూ నమ్మరు. రోహిత్‌కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలానే హిట్‌మ్యాన్ పగలబడి నవ్వకున్న వీడియో ఒకటి కూడా నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.
సియాట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల వేడుకలో ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శారంగ్ శృంగర్‌పురే కూడా పాల్గొన్నాడు. స్టేజ్‌పై అతడు తన మిమిక్రీ చాతుర్యతను చాటుకున్నాడు. టీమిండియా దిగ్గజం, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ వాయిస్‌ను మిమిక్రీ చేశాడు. అచ్చు మహీ లానే శారంగ్ మాట్లాడాడు. అది విన్న రోహిత్ శర్మ తన నవ్వును ఆపుకోలేకపోయాడు. పగలబడి నవ్వుకున్నాడు. ఓ దశలో చిన్న పిల్లాడిలా నవ్వాడు. ఆపై సూపర్ అంటూ సైగలు చేశాడు. రోహిత్ వెనకాలే ఉన్న అతడి సతీమణి రితికా కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
Also Read: Prithvi Shaw: బ్యాట్ ఎత్తడం, కాలర్ పట్టుకోవడం, దుర్భాషలాడటం.. పృథ్వీ షా ఇక మారాడా?
సియట్ క్రికెట్ రేటింగ్ వేడుకలో రోహిత్ శర్మకు ఓ ప్రత్యేక అవార్డు లభించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని గెలిపించినందుకు గానూ ఈ అవార్డు వరించింది. ఈ అవార్డును రోహిత్‌కు భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ అందజేశారు. 2024లో రోహిత్ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు 2023 వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది. టెస్ట్, టీ20లకు వీడ్కలు పలికిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు.
