మాజీ భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఇటీవల తన ‘ఆల్ టైమ్ ఇండియా టి20 ఎలెవన్’ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి దిగ్గజాలతో పాటు కొందరు యువ ఆటగాళ్లకు కూడా చోటు కల్పించారు.
ఉతప్ప తన జట్టులో ఓపెనర్లుగా విధ్వంసకర బ్యాటర్ రోహిత్ శర్మ, యువ సంచలనం అభిషేక్ శర్మలను ఎంపిక చేశారు. మూడో స్థానంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీని, నాలుగో స్థానంలో సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ను బరిలోకి దించారు. ఐదో స్థానంలో ఫినిషర్, వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎమ్మెస్ ధోనీని ఎంపిక చేయగా.. ఆరో స్థానంలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాకు చోటు దక్కింది.
జట్టులో సమతుల్యత కోసం ఏడో స్థానంలో హార్దిక్ పాండ్యా, ఎనిమిదో స్థానంలో అక్షర్ పటేల్ రూపంలో ఇద్దరు నాణ్యమైన ఆల్‌రౌండర్లను ఉతప్ప తీసుకున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్ వైపు ఆయన మొగ్గు చూపారు. పేస్ విభాగంలో స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.
రాబిన్ ఉతప్ప ఆల్ టైమ్ టి20 ఎలెవన్..
రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
ఉతప్ప ఎంపిక చేసిన ఈ జట్టుపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ప్రస్తుత టి20 టాప్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను నాలుగో స్థానంలో తీసుకోకపోవడం కొందరిని ఆశ్చర్యపరిచినా, యువరాజ్ సింగ్ సాధించిన ఘనతల దృష్ట్యా ఆ నిర్ణయం సరైనదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే తిలక్ వర్మ, సంజూ శాంసన్ వంటి యువ ఆటగాళ్లకు ఇందులో చోటు దక్కలేదు.
మొత్తంగా చూస్తే.. ఈ జట్టు ఎంతో బలంగా ఉంది. రైనా, యువరాజ్ వంటి పార్ట్-టైమ్ బౌలర్లు ఉండటం జట్టుకు అదనపు బలం. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ వంటి పేసర్లు ఎలాంటి బ్యాటింగ్ లైనప్‌నైనా కట్టడి చేయగలరు. ఉతప్ప ఎంపిక చేసిన ఈ జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ పరంగా అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

