RMZ Invest RS. 1 Lakh Crore in AP: ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి లభించింది. మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రముఖ రియల్ ఎస్టేట్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఆర్ఎంజడ్ (RMZ) గ్రూప్ రాష్ట్రంలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు దావోస్‌లో జరుగుతున్న 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం సందర్భంగా, ఆర్ఎంజడ్ ఛైర్మన్ మనోజ్ మెండా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు. దావోస్‌లో మంత్రి లోకేష్, మనోజ్ మెండాల మధ్య జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి.
విశాఖలో భారీ GCC పార్క్
ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించడం, విశాఖపట్నంలో GCC (గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్) ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా, విశాఖపట్నం కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్‌లో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో, 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో ఒక భారీ GCC పార్క్‌ను అభివృద్ధి చేయడానికి RMZ గ్రూప్ అంగీకరించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఐటీ, డిజిటల్ సేవలు, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి మరింత బలం చేకూరనుంది.
హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్
విశాఖపట్నం ప్రాంతంలో దశలవారీగా 1 గిగావాట్ లక్ష్య సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి కూడా RMZ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరం ఉంటుందని అంచనా. డేటా సెంటర్లు.. నెక్ట్స్ జెన్ డిజిటల్, ఏఐ వర్క్‌లోడ్స్‌కు మద్దతు.. స్థిరత్వం (Sustainability).. గ్రీన్ పవర్ ఇంటిగ్రేషన్‌కు ప్రాధాన్యత.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయనున్నట్లు RMZ ప్రకటించింది. మరోవైపు.. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా, టేకులోడు వద్ద RMZ గ్రూప్ సుమారు 1,000 ఎకరాల్లో ఒక భారీ పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్క్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా పారిశ్రామిక తయారీ.. గిడ్డంగులు.. లాజిస్టిక్స్ కార్యకలాపాలు.. విస్తృతంగా అభివృద్ధి చెందనున్నాయి… ఈ అన్ని ప్రాజెక్టులను కలిపి, రాబోయే ఐదేళ్లలో RMZ గ్రూప్ సుమారు 10 బిలియన్ డాలర్లు (రూ. లక్ష కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా ఐటీ, డేటా సెంటర్లు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాల్లో సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఏపీ ప్రభుత్వ కమిట్మెంట్
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం మరోసారి సింగిల్ విండో విధానం.. కాలపరిమితులతో కూడిన అనుమతులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. అంశాలపై తమ పూర్తి కమిట్మెంట్ను స్పష్టం చేసింది. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలతో రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తంగా, RMZ గ్రూప్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, డిజిటల్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు కొత్త ఊపునిస్తూ, విశాఖపట్నం మరియు రాయలసీమ ప్రాంతాల అభివృద్ధిలో కీలక మలుపుగా నిలవనున్నాయి.