Rising Stars Asia Cup 2026: నవంబర్ 19 నుంచి మరో సమరం.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..

Pak And Ind

Pak And Ind

దోహా వేదికగా నవంబర్ 19 నుంచి 29 వరకు జరగనున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌కు సంబంధించిన 15 మంది సభ్యులతో కూడిన ఇండియా-ఏ జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి మ్యాచ్‌లను 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, రింకూ సింగ్, హర్షిత్ రాణా వంటి ప్రముఖ ఆటగాళ్లకు చోటు దక్కింది.

ఇండియా-ఏ జట్టును గ్రూప్-బిలో ఉంచారు. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్-ఏ, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-ఎలో బంగ్లాదేశ్-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ, శ్రీలంక-ఏ జట్లు పోటీపడుతున్నాయి.

ఈ టోర్నమెంట్‌లో భాగంగా నవంబర్ 20న ఉదయం 11:30 గంటలకు వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేపాల్‌తో భారత్-ఏ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత నవంబర్ 22న ఉదయం 11:30 గంటలకు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్-ఏతో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. గత టోర్నమెంట్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైన భారత్, ఈసారి ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఆ తర్వాత నవంబర్ 24న ఉదయం 11:30 గంటలకు యూఏఈతో భారత్-ఏ తలపడనుంది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత నవంబర్ 26 మరియు 27 తేదీల్లో సెమీఫైనల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. నవంబర్ 29న గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌తో టోర్నమెంట్ ముగియనుంది. గత ఎడిషన్‌లో సెమీస్‌లోనే వెనుదిరిగిన భారత్-ఏ, ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని ఉత్సాహంగా ఉంది.