NTV Telugu Site icon

UK Prime Minister: బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌.. విజయం తథ్యం!

Rishi Sunak

Rishi Sunak

UK Prime Minister: యూకే నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ఎంపికయ్యేందుకు మార్గం సుగమమైనట్లు కనిపిస్తోంది. ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కన్జర్వేటివ్‌ నాయకుడిగా తనకు చట్టసభ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ రిషి సునాక్‌ కంటే వెనకబడి ఉన్నానని భావించిన బోరిస్‌ జాన్సన్‌ పోటీ నుంచి వైదొలగడమే మేలని వెల్లడించారు. పోటీలో నుంచి కీలక వ్యక్తి వైదొలగడం.. మరో అభ్యర్థి పెన్నీ మోర్డాంట్‌కు మద్దతు అంతంత మాత్రంగానే ఉండడం వల్ల రిషి సునాక్‌ విజయానికి చేరువైనట్లేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇవాళ స్పష్టం రానుండడంతో పాటు.. అన్ని కలిసొస్తే దీపావళి రోజునే రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవికి పోటీలో నిలిచేందుకు 100 మంది సభ్యుల మద్దతు అవసరం. రిషి సునాక్‌కు ఇప్పటికే 144 మంది సభ్యుల మద్దతు లభించింది. ఇప్పటివరకు బోరిస్‌ జాన్సన్‌కు 59 మంది సభ్యుల మద్దతు ఉండగా.. పోటీ నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించారు. ఇక మరో నాయకురాలు పెన్నీ మోర్డాంట్‌.. ఇప్పటివరకు కేవలం 23 మంది సభ్యుల మద్దతు మాత్రమే కూడగట్టారు. ఈ నేపథ్యంలో డెడ్‌లైన్‌ సమయానికి పోటీలో ఉండే సభ్యులపై స్పష్టత రానుంది. అందులో పార్టీ ఎంపీలు ఒక్కరికే పూర్తి మద్దతు ప్రకటిస్తే.. అందుకు రిషి సునాక్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కలిసి కట్టుగా పనిచేయాలని ఆశిస్తున్నామని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు. అందుకే నా నామినేషన్‌ను ముందుకు తీసుకెళ్లట్లేదన్నారు. ఈ పోటీలో విజయం సాధించేవారికి పూర్తి మద్దతు ఉంటుందని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. అయినా తాను ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ దేశానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. బోరిస్ నిర్ణయం అనంతరం రిషి సునాక్ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. బ్రెగ్జిట్, కరోనా వ్యాక్సిన్ల పంపణీ, ఉక్రెయిన్ యుద్ధం సమయంలో మాజీ ప్రధాని దేశాన్ని ముందుకు నడిపిన తీరు అద్భుతమని కొనియాడారు.

Kerala: కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం.. సాయంత్రం హైకోర్టు విచారణ..

భారత ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిసి సహ వ్యవస్థాపకుడైన నారాయణ మూర్తికి స్వయానా అల్లుడే ఈ రిషి సునాక్‌. ఆయన కూతురు అక్షతా మూర్తినే రిషి వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ విజయం సాధిస్తే ఇండియాకు కూడా ఎంతో సహకారంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.