Site icon NTV Telugu

Rishi Sunak: యూకేలో ఖలిస్తానీ తీవ్రవాదాన్ని సహించను.. హిందువుగా గర్విస్తున్నా..

Rishi Sunak

Rishi Sunak

Rishi Sunak: జీ-20 శిఖరాగ్ర సమావేశానికి భారత రాజధాని ఢిల్లీ పూర్తిగా సిద్ధమైంది. కాగా, శనివారం నుంచి ప్రారంభమయ్యే జీ-20 సదస్సు కోసం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌కు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. రిషి సునాక్ భారతదేశంతో సంబంధాలు, ఉచిత వాణిజ్య ఒప్పందం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సహా అనేక అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. జీ-20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సరైన దేశమని ఆయన అభివర్ణించారు. ఆయన తనను తాను గర్వించదగిన హిందువుగా అభివర్ణించాడు. భారతదేశ పర్యటన సందర్భంగా ఒక ఆలయాన్ని సందర్శించడం గురించి మాట్లాడారు.రిషి సునక్ మాట్లాడుతూ “నేను గర్వించదగిన హిందువునని, నేను కూడా అలాగే పెరిగాను. రక్షా బంధన్ పండుగను కూడా జరుపుకున్నాను. రక్షా బంధన్ రోజు మా అక్కాచెల్లెళ్లు నాకు రాఖీ కట్టారు. మొన్నటికి మొన్న జన్మాష్టమిని సక్రమంగా జరుపుకునే సమయం లేకున్నా, గుడికి వెళ్లి దర్శనం చేసుకుని సరిపెట్టుకుంటాను.” అని ఆయన తెలిపారు.

Also Read: G20 Summit: భారత గడ్డపై అగ్రరాజ్యం అధినేత జో బైడెన్‌.. అమెరికా అధ్యక్షుడికి అరుదైన గౌరవం

ఇదిలావుండగా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మంచి స్థితిలో ఉన్నాయని, ప్రధాని మోదీ, తాను ఇరుదేశాల సంబంధాలపై చర్చించేందురు ఆసక్తిగా ఉన్నామని రిషి సునాక్‌ అన్నారు. భారత్‌తో కొనసాగుతున్న ఉచిత వాణిజ్య ఒప్పందం చర్చల గురించి మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సమగ్రమైన, ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ఒప్పందం పూర్తయ్యేలా చూడాలని ప్రధాని మోడీ, తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. మేమిద్దరం మంచి ఒప్పందం జరగాలని నమ్ముతున్నామని, కానీ వాణిజ్య ఒప్పందాలు ఎల్లప్పుడూ సమయం తీసుకుంటాయన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరి గురించి రిషి సునాక్ మాట్లాడారు. అంతర్జాతీయ సమస్యలపై భారత్ ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో చెప్పడం నా పని కాదని ఆయన స్పష్టం చేశారు.

Also Read: G20 Summit 2023 LIVE UPDATES: జీ20 సదస్సు.. భారత్‌లో అడుగుపెట్టిన జో బైడెన్

ఖలిస్థాన్ అనుకూల తీవ్రవాదం గురించి అడిగినప్పుడు.. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి రిషి సునక్ స్పందించారు. ఏ విధమైన హింస లేదా తీవ్రవాదం దేశంలో ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఖలిస్థానీ అనుకూల తీవ్రవాదాన్ని పరిష్కరించడానికి యూకే భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని రిషి సునాక్ వెల్లడించారు. జీ20 లీడర్స్ సమ్మిట్ కోసం ఢిల్లీకి వచ్చిన కొద్దిసేపటికే సునక్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భార్య అక్షతా మూర్తితో పాటు కలిసి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన రిషి సునాక్‌కు కేంద్ర మంత్రి అశ్విని చౌబే, భారతదేశంలోని బ్రిటిష్ హైకమీషనర్ అలెక్స్ ఎల్లిస్, సీనియర్ దౌత్యవేత్తలు స్వాగతం పలికారు. ఈ ఏడాది మార్చిలో లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఖలిస్తాన్ అనుకూలవాదులు దాడి చేయడం భారత్‌కు ఆగ్రహం తెప్పించింది. భవనం ముందు భాగంలో ఉన్న స్తంభం నుంచి భారత త్రివర్ణ పతాకాన్ని కిందకు లాగారు. ఈ సంఘటన తర్వాత యూకే ప్రభుత్వం ఇండియన్ హైకమిషన్ వద్ద భద్రతను సమీక్షించడానికి, దాని సిబ్బంది భద్రత కోసం అవసరమైన మార్పులను అమలు చేయడానికి మెట్రోపాలిటన్ పోలీసులతో కలిసి పని చేస్తుందని తెలిపింది.5వ భారతదేశం-యూకె హోం వ్యవహారాల సంభాషణ సందర్భంగా భారత హోం మంత్రిత్వ శాఖ యూకే ప్రభుత్వంతో మాట్లాడింది. లండన్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, నిరసనలపై చర్చించింది.ఈ సమావేశంలో తమ దేశంలో ఖలిస్తానీ కార్యకలాపాలపై నిశిత నిఘా ఉంచాలని, తదనుగుణంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ కింగ్‌డమ్‌ను భారత్ కోరింది.

Exit mobile version