UK PM Rishi Sunak: ఎట్టకేలకు భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. 357 సీట్లు గల బ్రిటన్ పార్లమెంట్‌లో అత్యధికంగా రిషి సునాక్‌కు మద్దతు ప్రకటించడంతో ఆయన యూకే ప్రధాని అయ్యారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఇక రేసులో మిగిలి ఉన్న పెన్నీ మోర్డాంట్ కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. ఫలితంగా బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించారు.
మాజీ బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ విధేయురాలు అయిన ప్రీతి పటేల్ కూడా రిషి సునాక్‌కు మద్దతు ఇచ్చారు. బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి పోటీ నుంచి వైదొలగుతున్నానని ప్రకటించిన అనంతరం ఆమె రిషి సునాక్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజాసేవకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రీతి పటేల్ అన్నారు. దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాజకీయ విభేదాలను పక్కన పెట్టి రిషి సునాక్‌కు మద్దతుగా నిలవాలన్నారు.
లిజ్ ట్రాస్ రాజీనామా చేయగానే.. ప్రధాని పదవి కోసం బోరిస్ మరోసారి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆయన కూడా వేగంగా పావులు కదిపారు. దాదాపు 100 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకు మద్దతు తెలిపినట్లు సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. దీంతో పోటీ లేకుండా ప్రధాని అయ్యేందుకు ఆయన రిషి సునాక్, పెన్నీ మోర్డాంట్‌తో చర్చలు జరపగా వారు రేసు నుంచి తప్పుకునేందుకు నిరాకరించారు. మరోవైపు రిషి సునాక్‌కు అత్యధికంగా ఎంపీలు అండగా ఉన్నారు. దీంతో రిషితో పోటీపడి గెలవలేనని భావించిన బోరిస్.. ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీని తాను ఏకం చేయలేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయినా తాను ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ దేశానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రిషి సునాక్ విజయం సునాయాసమైంది. ప్రస్తుతం ఉన్న యూకే ఆర్థిక పరిస్థితిని చక్క దిద్దడానికి ఇప్పుడు రిషి సునాక్ కీలకమని అక్కడి ఎంపీలు భావిస్తున్నారు. భారత్‌తో ఫ్రీ ట్రేడ్ ఒప్పందంతో బ్రిటన్ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని.. అందుకు రిషి సునాక్ సేవలు అవసరమని బ్రిటన్ ఎంపీలు భావిస్తున్నారు.
