Site icon NTV Telugu

Rinku Singh: అక్కడుంది రింకూ సింగ్.. ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా బాదుడు మాత్రం సేమ్!

Rinku Singh

Rinku Singh

IPL star Rinku Singh Hits 3 Sixes in Debut T20: ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ఆరంభించాడు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేసిన రింకూ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన శైలిలో సిక్సర్లు బాది అభిమానులను అలరించాడు. రెండో టీ20లో రింకూ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో మొదటిసారి బ్యాటింగ్‌ చేసినా కూడా రింకూలో ఎలాంటి బెరుకు కనిపించలేదు.

రెండో టీ20లో రింకూ సింగ్ తొలి 16 బంతుల్లో ఓ బౌండరీ సాయంతో 15 పరుగులే చేశాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌, సంజు శాంసన్‌ వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో రింకూ క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. అయితే చివరి 5 బంతుల్లో 4, 6, 6, 1, 6 బాది 23 పరుగులు పిండుకున్నాడు. ఐపీఎల్ 2023లో చెలరేగినట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా రెచ్చిపోయాడు. ప్రస్తుతం రింకూ సింగ్ సిక్సర్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రింకూ షాట్స్ చూసిన ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ‘అక్కడుంది రింకూ సింగ్’, ‘ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా రింకూ బాదుడు మాత్రం సేమ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Asia Cup 2023: ఆసియా కప్ 2023కి ముందు నిప్పులపై నడిచిన క్రికెటర్.. ఎందుకో తెలుసా?

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20 సిరీస్‌ని మరో మ్యాచ్‌ మిగిలుండగానే బుమ్రా సేన కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (58; 43 బంతుల్లో 6×4, 1×6), సంజు శాంసన్‌ (40; 26 బంతుల్లో 5×4, 1×6) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఆండీ బాల్‌బిర్నీ (72; 51 బంతుల్లో 5×4, 4×6) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు.

Exit mobile version