ఇది దేశానికి చాలా కీలకమైన సమయం అని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ బ్రాండ్‌ను ప్రపంచమంతటా గుర్తింపు పొందే స్థాయికి తీసుకువచ్చారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. రైట్ టైమ్, రైట్ లీడర్, రైట్ డెసిషన్.. నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వంలో ఆ పార్టీ మరింత అభివృద్ధి చెందాలని సీఎం ఆకాక్షించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్‌ను ఢిల్లీలో చంద్రబాబు కలిసి అభినందించారు. అనంతరం ఏపీ సీఎం మీడియాతో మాట్లాడారు.
‘బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్‌కు అభినందనలు. చాలా సంతోషంగా ఉంది. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, అనేకసార్లు ఎమ్మెల్యేగా నితిన్ గెలుస్తూ వచ్చారు. దేశానికి ఈ సమయం చాలా కీలకమైనది. భారతదేశానికి ప్రపంచమంతటా ప్రధాని మోడీ గుర్తింపు తీసుకొచ్చారు. భారతదేశ బ్రాండ్‌ను ప్రధాని మోడీ ప్రపంచం మొత్తం చాటి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రధాని ముందుకు తీసుకెళ్తున్నారు. సరైన సమయంలో, సరైన నాయకుడు ప్రధాని మోడీ. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో దేశం అన్ని విధాలుగా అభివృద్ధి అవుతుందని ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
