ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని.. తెలుగు వారు అందరూ ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపుకు నిలబడాలిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే అసదుద్దీన్.. ఆయన గెలుపుకు కృషి చేయాలని వ్యక్తిగతంగా కోరుతున్నానన్నారు. సుదర్శన్ రెడ్డి గెలుపు వల్ల మన తెలుగువారి ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో సుదర్శన్ రెడ్డితో తెలంగాణ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘మన తెలుగు వారు అందరూ సుదర్శన్ రెడ్డి గారిని అభినందించాలి. మనం అందరం ఆయన గెలుపుకోసం నిర్ణయం తీసుకోవాలి. తెలుగు వారి ఉనికికి ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి గారు ఈ ఎన్నికలో బరిలోకి రావడం జరిగింది. ఎన్డీయే కూటమికి బలమైన ఛాలెంజ్ ను విసరడం జరిగింది. రాజ్యాంగాన్ని సంరక్షించాలి. ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి రాజీనామా అందరినీ ఆశ్చర్య పరిచింది. రాజ్యాంగాన్ని కాపాడాలి, రిజర్వేషన్లను కాపాడాలి. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. తెలుగు వారు అందరూ సుదర్శన్ రెడ్డి గారి గెలుపుకు నిలబడాలి. ప్రతి ఒక్కరు ఆయన గెలుపుకు కృషి చేయాలని వ్యక్తిగతంగా కోరుతున్నాం’ అని అన్నారు.
Also Read: Aadi Srinivas: కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు.. వారి వద్ద కోట్ల రూపాయలు దొరకడం ఏంటి?
‘సుదర్శన్ రెడ్డి గారి గెలుపు వల్ల మన తెలుగువారి ప్రతిష్ఠ పెరుగుతుంది. ఓట్ల చోరీతో ఎన్నికల్లో నెగ్గాలని బీజేపీ చూస్తోంది. ఇలాంటి సమయంలో పెద్దల సభ సజావుగా సాగాలంటే.. ప్రజాస్వామ్యం భద్రంగా ఉండాలంటే.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సరైన వ్యక్తి. ఒక న్యాయమూర్తిగా, లౌకిక వాదిగా, పేదల పక్షపాతిగా.. అన్నివిధాల సుదర్శన్ రెడ్డి సరైన వ్యక్తిగా ఉన్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజ్ కృష్ణలో సుదర్శన్ రెడ్డితో భేటీ అయ్యారు.
