CM Revanth Reddy : విద్యుత్ కొరత వేళ సీఎం కీలక ఆదేశాలు.. నేతలకు పల్లెబాట పిలుపు

  • సన్న వడ్ల సాగుపై సీఎం కీలక వ్యాఖ్యలు
  • యాదాద్రి ప్లాంట్‌పై అవినీతి ఆరోపణలు
  • విద్యుత్ పొదుపునకు ప్రభుత్వ సూచనలు
  • గ్రామాల్లో పర్యటించాలని నేతలకు ఆదేశాలు
Cm Revanth Reddy

Cm Revanth Reddy

సన్న వడ్లు సాగు చేయాలని తాము ముందే చెప్పినప్పటికీ, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు బుడబుక్కల వలె తప్పుడు ప్రచారాలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం మార్కెట్లో సన్న వడ్లకు విపరీతమైన డిమాండ్ వచ్చిందని, ప్రతిపక్షాల అబద్ధాలను తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు వివరించాలని పార్టీ నాయకులకు సూచించారు. వాస్తవాలను దాచిపెట్టడం క్యాన్సర్ లాంటిదని, అది ప్రాణాలకే ముప్పని హెచ్చరించారు. తాటి చెట్టంత ఎదిగినా అవగింజంత తెలివి లేకపోతే అతని పేరే హరీష్ రావు అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

యాదాద్రి ప్లాంట్ పూర్తిగా దోచుకోవడానికి చేసిన ప్రాజెక్ట్ అని సీఎం ఆరోపించారు. ప్రతిమా శ్రీనివాస్‌కు లక్ష కోట్లు లబ్ది చేకూర్చేందుకే మిర్యాలగూడలో పవర్ ప్లాంట్ కట్టారని మండిపడ్డారు. కేసీఆర్, జగదీష్ రెడ్డి, హరీష్‌లను గుంజకు కట్టేసి కొట్టినా తప్పులేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కేసీఆర్ కుటుంబానికే పోయాయని, నీళ్లు ఫామ్ హౌస్‌కు, నిధులు పార్టీ ఖాతాలోకి, ఉద్యోగాలు ఇంటివారికే దక్కాయని దుయ్యబట్టారు. విదేశాల నుంచి మద్యం సంతోష్ రావు తెచ్చారని ఆరోపించారు. కరువు రావాలని పూజలు చేసిన వారు ఇప్పుడు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. ఎంత ఖర్చయినా సరే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని, బ్యాంకర్లు అప్పులిచ్చినా విద్యుత్ దొరకని పరిస్థితి ఉందని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అనవసరంగా ఏసీలు, ట్యూబ్‌లైట్లు బంద్ చేయాలని, సోలార్ పవర్‌ను ప్రోత్సహించాలని సూచించారు. ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తమై రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రైతు వేదికల ద్వారా రైతులను అప్రమత్తం చేసి ఆరుతడి పంటల వైపు మళ్లించాలని, పశువులకు తాగునీరు, మేత అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.

సంక్రాంతి తర్వాత వచ్చే నాలుగు నెలల పాటు పేదలను, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని సీఎం వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్నం వదిలి పల్లె బాట పట్టాలని, గ్రామాల్లో తిరిగి ప్రజలకు వాస్తవాలు వివరించాలని స్పష్టం చేశారు. ఎవరెవరు ఎక్కడ పర్యటిస్తున్నారో మంత్రి తుమ్మల ద్వారా ట్రాక్ చేస్తామని, గాంధీభవన్‌లో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసి వివరాలు క్షేత్రస్థాయికి పంపాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గతంతో పోలిస్తే ఓట్ల నమోదు తక్కువగా ఉందని, మన సానుభూతిపరులను పెద్దఎత్తున ఓటర్లుగా నమోదు చేయించాలని పార్టీ శ్రేణులను కోరారు.