కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలానగర్, మూసాపేటలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి రమేష్ కు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోడ్ షోలో మాట్లాడుతూ.. వృద్దులకు పెన్షన్లు ఇవ్వటం కాదు.. ఇంట్లో ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించాలి.. పీజీ, పీహెచ్ డీలు చదువుకున్న వారిని బర్రెలు, గొర్రెలు కాసుకోమంటున్నాడు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ కాలెండర్ విడుదల చేస్తాము అని ఆయన తెలిపారు. అవుటర్ చుట్టూ పక్కల కేసీఆర్, ఆయన కుటుంబం, అనుచరులు 10 వేల ఎకరాల భూమి కబ్జా చేశారు.. పేదలకు ఇండ్లు కట్టించేందుకు నగరంతో పాటు చుట్టూ పక్కల స్థలం లేదనే కేసీఆర్ కి 10 వేల ఎకరాలు కబ్జా చేయటానికి మాత్రం స్థలం ఎలా వచ్చింది అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Read Also: Tirupati Svims Hospital: స్విమ్స్ సెక్యూరిటీ సిబ్బంది ఓవరాక్షన్.. టీటీడీ ఉద్యోగి తండ్రి మృతి
ఎవరూ అడ్డం పడినా ఈసారీ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం పక్కా అని రేవంత్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు కబ్జాలకు పాల్పడ్డాడని ఆరోపణలపై, రాష్ట్రంలో బీర్ఎస్ నాయకుల అవినీతిపై, కాంగ్రెస్ పార్టీ అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులపై మేం పార్టీ అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామన్నారు. డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాము.. ఆరు గ్యారంటీలు, నూరు సీట్లు లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన తెలిపారు. అవినీతిమయమైన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించటం కోసం హస్తం గుర్తుపై ఓటు వేయండి అని రేవంత్ రెడ్డి కోరారు.