CM Revanth Reddy to Meet PM Modi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, నిధుల కేటాయింపు, దీర్ఘకాలిక సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా త్వరలో జరగనున్న ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో ప్రభావం, కరువు పరిస్థితులు, సాగునీటి అవసరాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానికి వివరించి, రాష్ట్రానికి రూ. 30 వేల కోట్ల తక్షణ ఆర్థిక ప్యాకేజీని మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. అలాగే, రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సహాయంపై ప్రధానికి ప్రత్యేకంగా వినతిపత్రం సమర్పించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సమ్మతి ఇప్పించాలని కోరనున్నారు. ఈ ప్రాజెక్టుకు సత్వర అనుమతులతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (ఏఐబీపీ)’ కింద ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేయనున్నారు. సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి అవసరమైన అనుమతులతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇప్పించాలని కోరనున్నారు.
వీటితో పాటు, గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ పరిధిలోని ఇచ్చంపల్లి వద్ద గోదావరిపై బరాజ్ నిర్మించి అక్కడి నుంచి నీళ్లను తరలించాలని, ఆ తరలించే నీళ్లలో 50 శాతం వాటాను తెలంగాణకు కేటాయించాలని ప్రధానిని కోరనున్నట్లు తెలుస్తోంది. సీతమ్మసాగర్ బరాజ్, డిండి, పాలమూరు–రంగారెడ్డి తదితర ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను వేగంగా ఇప్పించడంతో పాటు, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఆర్థిక చేయూత అందించాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానిని కోరనున్నారు.

