Site icon NTV Telugu

Revanth Reddy : సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ లేఖ.. బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై ప్రస్తావన

Revanth Reddy

Revanth Reddy

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో.. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు… బడ్జెట్ లో నిధుల కేటాయింపు గురించి లేఖలో ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని మీరు ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని, గడిచిన నాలుగేళ్లలో రెండు విడతల్లో కలిపి మొత్తం మీరు మాఫీ చేసింది కేవలం రూ.3,881 కోట్లు మాత్రమేనని ఆయన అన్నారు. ఇంకా రూ.20,857 కోట్లు మాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, దళిత సామాజిక వర్గానికి మీరు తీరని అన్యాయం చేశారన్నారు. తొలి దళిత ముఖ్యమంత్రి మొదలు, ప్రతి కుటుంబానికి మూడెకరాలు భూమి వరకు ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన వెల్లడించారు. ఇప్పుడు దళితబంధు పేరుతో ఆ వర్గాలను మరోసారి వంచించేందుకు సిద్ధమయ్యారని, పథకం అమలు తీరు చూస్తే ఊరికో కోడి… ఇంటికో ఈక అన్నట్లు తయారైందన్నారు. పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టును మీరు ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చినట్లు కనిపిస్తోందని, రూ.35,200 కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ.60 వేల కోట్లకు చేరిందన్నారు. గత బడ్జెట్ లో చేసిన కేటాయింపులు కేవలం రూ.1,225 కోట్లు మాత్రమేనని, ఇలా కేటాయింపులు చేస్తే ఈ ప్రాజెక్టు మరో 60 –70 ఏళ్లకు కూడా పూర్తి కాదన్నారు.

Also Read : Viral Video: ‘నేను లాయర్’..సీటుపై కాలు తీయమన్నందుకు యువతి హల్‌చల్

డబుల్ బెడ్ రూం ఇళ్లపై గడిచిన తొమ్మిదేళ్లుగా మీరు ప్రజలను ఊరిస్తూనే ఉన్నారన్నారు రేవంత్‌ రెడ్డి. తొమ్మిదేళ్లలో మీరు మంజూరు చేసిన ఇళ్లు కేవలం 2,97,057 మాత్రమేనని, ఇందులో 2,28,520 నిర్మాణం మొదలవగా.. లబ్ధిదారులకు అందజేసినవి కేవలం 21 వేలు మాత్రమేనని, సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్న మీ హామీ ఏమైందన్నారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకానికి ఇంత వరకు మార్గదర్శకాలు లేవు… పథకం ప్రారంభించింది లేదన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3016 నిరుద్యోగ భృతి ఏమైందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ వద్ద సుమారు 26 లక్షల మంది నిరుద్యోగుల నమోదు జాబితా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎవరికీ ఒక్క రూపాయి భృతి ఇచ్చింది లేదని, పేద విద్యార్థుల కోసం కాంగ్రెస్ హాయంలో తెచ్చిన ఫీజు రీ ఇంబర్స్ మెంట్ పథకాన్ని అటకెక్కించారని ఆయన మండిపడ్డారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామన్న మీ హామీ ఒక బూటకమని, పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలతో రైతులు రోడ్డెక్కుతున్నారని ఆయన అన్నారు.

Also Read : Karumuri Nageswara Rao: ఫోన్ ట్యాపింగ్ వివాదంపై మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు.. ఆ సర్వే రిపోర్ట్‌ వల్లే..!

తెలంగాణలో మళ్లీ సబ్ స్టేషన్ల ముందు ధర్నాల దృశ్యాలు కనిపిస్తున్నాయని, నష్టాల భర్తీ పేరుతో గృహ వినియోగదారులపై ఏసీడీ పేరుతో అదనపు చార్జీల భారం మోపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం విషయంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, కొత్త వాటి సంగతి దేవుడెరుగు… ఉన్న ఆస్పత్రులు నిర్వహణకే నిధులు లేని పరిస్థితి ఆయన ఆరోపించారు. ప్రజలకు మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇది మీకు చివరి ఛాన్స్ అని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో మీకు ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version