Site icon NTV Telugu

CM Revanth Reddy : మోడీ పరివారం.. గాడ్సే పరివారం

Revanth Reddy Speech

Revanth Reddy Speech

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కుల గణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే అని గర్వంగా తెలిపారు. రాష్ట్రంలోని కుల గణనను తాము విజయవంతంగా పూర్తి చేశామని, అదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా జనాభా గణనతో పాటు కుల గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం 21 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశామని వెల్లడించారు. రైతులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల గొంతుక అయిన ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి హానికరమని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని, కానీ వాస్తవంగా దేశ యువత నిరుద్యోగంతో తల్లడిల్లుతుందని వ్యాఖ్యానించారు. ఆయన పాలనలో దేశానికి అభివృద్ధి కన్నా మోసం ఎక్కువగా జరిగిందని ఆరోపించారు.

రాహుల్ గాంధీతో కలిసి గాంధీ పరివారమంతా పనిచేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, నైతికత కోసం పోరాడే నాయకుడిగా రాహుల్ గాంధీని ఆదరించాలని కోరారు. కాగా మోడీ పరివారాన్ని గాడ్సే పరివారంగా అభివర్ణించి తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణకు స్వాతంత్య్రం రావడానికి వలభాయ్ పటేల్ పాత్ర ఎంతో గొప్పదని రేవంత్ గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర ఏర్పాటు మాత్రం సోనియా గాంధీ ఆశయ ఫలమని తెలిపారు. బ్రిటిష్ వాళ్లు ఎలా దేశ సంపదను లూటీ చేశారో, అదే బాటలో బీజేపీ నాయకులు కూడా నడుస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ఆస్తులు ప్రైవేటు కార్పొరేట్‌లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. వచ్చే రోజుల్లో దేశం మీద విపరీతంగా పెరుగుతున్న బీజేపీ చెరను తొలగించాలన్న బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ అడుగుపెట్టనివ్వకపోవడం తమ గెలుపు సూచిక అని పేర్కొన్నారు.

Minister Kollu Ravindra: మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి.. రూ.32 వేల కోట్ల అప్పులు..!

Exit mobile version