ఎల్‌నినో ప్రభావం వల్ల అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. భవిష్యత్తులో రాబోయే తీవ్రమైన నీటి, విద్యుత్, వ్యవసాయ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు తక్షణ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని తమ నివాసంలో శనివారం నిర్వహించిన ఉన్నతాధికారుల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు.
రాబోయే ఎనిమిది నెలలు ఎల్‌నినో సంక్షోభాన్ని అధిగమించడంలో అత్యంత కీలకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో సరైన ప్రణాళికలు లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఎంతటి ఖర్చుకైనా సిద్ధంగా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో విద్యుత్ లభ్యత తక్కువగా ఉందన్నారు. అందుకే ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని, విద్యుత్ ఆధారిత పనులను తాత్కాలికంగా వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతులు వేసిన పంటలకు చేతికొచ్చే వరకు నీటి కొరత లేకుండా చూస్తూ, చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంపై గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేయాలని, సినిమా, మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించేందుకు ప్రత్యేకంగా ‘వార్ రూమ్’ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని, సీఎంఓ ఉన్నతాధికారులు విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులు, కరువు మండలాల అంశంపై త్వరలోనే మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున, కరువు మండలాలను ప్రకటించి 20 వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ తీర్మానం ద్వారా విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం (VB-G RAM G) కింద లభించే 125 రోజుల పనిదినాలకు అదనంగా మరో 50 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్రాన్ని కోరాలని అధికారులకు సూచించారు. ఈ అదనపు ఉపాధికి అయ్యే ఖర్చును భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటుపై మంత్రుల భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దసరా పండుగ తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

