NTV Telugu Site icon

Supreme Court: మతమార్పిడి తీవ్రమైన సమస్య.. దీన్ని రాజకీయం చేయొద్దు

Supreme Court

Supreme Court

Supreme Court: మత మార్పిడి అనేది తీవ్రమైన సమస్య అని.. అది రాజకీయ రంగు పులుముకోకూడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరిత మత మార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్‌పై అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సహాయాన్ని సోమవారం న్యాయస్థానం కోరింది. బెదిరింపులు, బహుమతులు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టడం ద్వారా జరుగుతున్న మత మార్పిడులకు చెక్ పెట్టాలని పిటిషనర్ కోరిన కేసులో హాజరుకావాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం వెంకటరమణిని కోరింది. ప్రలోభం ద్వారా మత మార్పిడులు జరుగుతున్నట్లయితే.. ఏం చేయాలి? దిద్దుబాటు చర్యలు ఏమిటి?.. అంటూ అటార్నీ జనరల్‌ చెప్పాలని ధర్మాసనం కోరింది. విచారణ ప్రారంభంలో తమిళనాడు తరఫు సీనియర్ న్యాయవాది పి.విల్సన్, ఈ పిటిషన్‌ను రాజకీయ ప్రేరేపిత పిల్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అలాంటి మార్పిడుల ప్రశ్నే లేదని నొక్కి చెప్పారు.

బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. “మీరు ఇలా ఆందోళన చెందడానికి వేరే కారణాలు ఉండవచ్చు. కోర్టు విచారణలను ఇతర విషయాల్లోకి మార్చవద్దు. … మొత్తం రాష్ట్రం కోసం మేము ఆందోళన చెందుతున్నాము. ఇది మీ రాష్ట్రంలో జరుగుతుంటే, ఇది చెడ్డది. కాకపోతే మంచిది. ఒక రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకోవద్దు. రాజకీయం చేయవద్దు.” మోసపూరిత మత మార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.

Read Also: Harassment Case: లైంగిక వేధింపుల కేసు.. సందీప్‌ సింగ్‌పై 7గంటల పాటు ప్రశ్నల వర్షం

బలవంతపు మత మార్పిడి జాతీయ భద్రతకు ప్రమాదకరం, పౌరుల మత స్వేచ్ఛకు భంగం కలిగించవచ్చని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని, నిజాయితీగా ప్రయత్నించాలని కోరింది. మోసం, ప్రలోభాలు, బెదిరింపుల ద్వారా మతమార్పిడిని ఆపకపోతే చాలా క్లిష్ట పరిస్థితి తలెత్తుతుందని కోర్టు హెచ్చరించింది. మతస్వేచ్ఛలో ఇతరులను మతం మార్చే హక్కు ఉండదని గుజరాత్ ప్రభుత్వం అంతకుముందు విచారణలో సుప్రీంకోర్టుకు తెలిపింది.

Read Also: Delhi Mayor Polls: ఢిల్లీలో హైటెన్షన్‌.. వీధుల్లో ఆప్, బీజేపీ పోటాపోటీ నిరసనలు

బలవంతపు మత మార్పిడి దేశవ్యాప్త సమస్య అని, తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయ్ తన పిటిషన్‌లో సమర్పించారు. “బహుమతులు, డబ్బులతో ప్రలోభపెట్టడం, బెదిరించడం, మోసపూరితంగా ప్రలోభపెట్టడం, మాయమాటలు, మూఢనమ్మకాలు, అద్భుతాలు చేయడం ద్వారా మతం మారుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా ప్రతి వారం నమోదవుతున్నాయి, కానీ కేంద్రం, రాష్ట్రాలు ఈ ముప్పును అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోలేదు.” న్యాయవాది అశ్వనీ కుమార్ దూబే ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. బెదిరింపుల ద్వారా, ద్రవ్య ప్రయోజనాల ద్వారా మత మార్పిడిని నియంత్రించడానికి ఒక నివేదికతో పాటు బిల్లును సిద్ధం చేయడానికి లా కమిషన్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్ కోరింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 7న జరగనుంది.