Site icon NTV Telugu

CM KCR : రేపటి నుండి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల

Cm Kcr

Cm Kcr

రేపటి నుండి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల, వేసిన వరిచేను దెబ్బతినే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు, మంత్రులు గత నాలుగైదు రోజుల నుంచి ముఖ్యమంత్రి కి పలు విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో… ఈరోజు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో సాగర్ ఎడమ కాలువ కింద వరి పంటలకు సాగునీరు అందించే విషయంపై చర్చ జరిగింది.

Also Read : World Cup 2023: ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించిన న్యూజిలాండ్

తెలంగాణ వాటా కింద కృష్ణా జలాలలో మన నీరు ఉన్న నేపథ్యంలో, రేపటి నుండి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. మరో 20 రోజుల తర్వాత మరో తడి కోసం నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. వానలు లేక, సాగర్ రిజర్వాయర్ లో ఆశించిన మేరకు నీటి నిల్వలు లేని కారణంగా, సాగునీటిని ఒడుపుగా, పొదుపుగా వాడుకొని వరి పంటను కాపాడుకోవాలని కేసీఆర్ రైతాంగానికి పిలుపునిచ్చారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా నీళ్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాలలో పర్యవేక్షిస్తూ, రైతుల చివరి పొలాలకు, చివరి ఆయకట్టు దాకా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

Also Read : BL Santosh : ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదు.. ఉండే వారు ఉంటారు.. పోయే వారు పోతారు

Exit mobile version